క‌ర్ణాట‌క‌లో బెదిరింపు రాజ‌కీయాలు

787

బిజెపి బెదిరింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఆరోపించారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీల నేత‌ల‌ను త‌మ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని మండిప‌డ్డారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇన్‌క‌మ్ టాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌, సిబిఐ విభాగాల‌ను దుర్వినియోగం చేస్తోంద‌ని….వాటిని ఉప‌యోగించి ప్ర‌త్య‌ర్ది వ‌ర్గీయుల‌ను బెదిరిస్తున్నార‌ని సిద్ధ‌రామ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో రాష్ట్ర మంత్రి డికె శివ‌కుమార్‌పై బిజెపి ఐటి అస్త్రాన్ని ప్ర‌యోగించి ఇరుకున పెట్టింద‌ని తెలిపారు. ఐటి దాడుల‌నుంచి త‌ప్పించుకోవాలంటే శివ‌కుమార్ బిజెపిలో చేరాల‌ని ఐటి అధికారులు ఒత్తిడి చేసిన విష‌యాన్ని సీఎం సిద్ధ‌రామ‌య్య మీడియాకు వివ‌రించారు.

అదే విధంగా ప్ర‌ధాని మోడీ తీసుకున్న‌ పెద్ద‌నోట్ల విష‌యాన్నిసిద్ధ‌రామ‌య్య త‌ప్పుబ‌ట్టారు. దేశంలో చిన్న చిన్న వ్యాపారాలు భారీగా న‌ష్ట‌పోయాయ‌ని సీఎం తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వానికి ఎవ‌రైనా వ్య‌తిరేకంగా మాట్లాడితే వారిపై ఐటి దాడులు చేయిస్తున్నార‌ని అందుకే చాలా మంది త‌మ నిర‌స‌న‌ల‌ను తెలిప‌డం లేద‌ని సీఎం తెలిపారు.

మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో దేశంలో నిరంకుశ పాల‌న కొన‌సాగుతోందని సిద్ధ‌రామ‌య్య ఆవేదన వ్య‌క్తం చేశారు. ఎల్‌కె అద్వానీ వంటి సీనియ‌ర్ నాయ‌కుల‌ను సైతం క‌నుమ‌రుగ‌య్యేలా చేశార‌ని సీఎం గుర్తుచేశారు.

క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన చాలా మంది కాంగ్రెస్ నేత‌లు బిజెపిలోకి చేరుతున్నారనే త‌ప్పుడు ప్ర‌చారాన్ని బిజెపి నేత‌లు చేస్తున్నార‌ని …అటువంటి ప్ర‌చారాన్ని ఆపాల‌ని వారిని హెచ్చ‌రించారు.

ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఆక‌ర్షించాల‌ని అమిత్ షా క‌న్న‌డ బిజెపి నేత‌ల‌కు సూచించార‌ని అందుకే ఇలాంటి కుటిల ప్ర‌య‌త్నాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES