వివ‌క్షకు మూల‌పు వేరు ఇల్లే!

676

‘ఇంట్లో వివ‌క్ష’ అనే మాట వినిపించ‌గానే ఆడ‌పిల్ల ప‌ట్ల వివ‌క్ష చూపిస్తున్నార‌నుకుంటారు. కానీ ఆడ‌ మ‌గ తేడా లేకుండా ఎవ‌రినైనా వివ‌క్ష‌కు గురి చేసే భూతం ఒక‌టుంది. ఒక త‌ల్లి క‌డుపున పుట్టిన ఇద్ద‌రు పిల్ల‌ల్లో ఒక‌రిని బ‌లి తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర‌లేదు. అంత‌టి భ‌యంక‌ర‌మైన భూతం మేని ఛాయ‌.

వ‌ర్ణ వివ‌క్ష… అంత‌టి పెద్ద ప‌దం వాడాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్లు అనిపించ‌దు. కానీ ఇది అక్ష‌రాలా వివ‌క్షే. ఒంటి రంగును బ‌ట్టి పిల్ల‌ల్ని చిన్న‌బుచ్చ‌డం దారుణ‌మైన నేరం. ఈ నేరానికి పాల్ప‌డుతున్న సంగ‌తి తెలియ‌క‌నే ఈ త‌ప్పు చేస్తుంటారు. పిల్ల‌ల చిన్న మ‌న‌సును ఘోరంగా చిదిమేస్తుంటారు. చాలా సంద‌ర్భాల‌లో ఇంట్లోనే ఈ వివ‌క్ష మొద‌ల‌వుతుంటుంది. ఒక్కొక్క సారి ఈ త‌ప్పు త‌ల్లిదండ్రులు చేయ‌క‌పోయినా బంధువులు చేస్తుంటారు. వాళ్ల‌ను ఏమీ అన‌లేని నిస్స‌హాయ‌త‌తో త‌ల్లిదండ్రులు త‌మ‌కు తాము స‌ర్ది చెప్పుకుంటారు, కానీ పిల్ల‌ల మ‌న‌సు మీద తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

పేరెంట్స్ ఏం చేయాలి?

  • పిల్ల‌ల ద‌గ్గ‌ర రంగు ప్ర‌స్తావ‌న తీసుకురాకూడ‌దు.
  • మ‌న ఇంటికి వ‌చ్చిన వాళ్ల‌లో కానీ, మ‌నం ఒక చోట‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి పిల్ల‌లు తెల్ల‌గా ఉంటే… చాలామందికి తెలియ‌కుండానే ‘అబ్బ ఆ పిల్ల‌వాడు ఎంత తెల్ల‌గా ఉన్నాడో, ఆ అమ్మాయి ఎంత తెల్ల‌గా ఉందో’ వంటి మాట‌లు దొర్లిపోతుంటాయి. ఆ మాట విన‌గానే రంగు త‌క్కువ‌గా ఉన్న పిల్ల‌ల్లో న్యూన‌త క‌లుగుతుంది. ఇక ఆ పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకోలేక‌పోతారు. బిడియంగా దూరంగా ఉండిపోతారు.
  • పేరెంట్స్ ఎంత సెన్సిబుల్‌గా ఉన్న‌ప్ప‌టికీ ఇంటికి వ‌చ్చిన వాళ్లు, బ‌య‌ట క‌లిసిన వాళ్లు అంత సెన్సిబుల్‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. ‘అరే ! మీ పిల్ల‌లా? ఏంటి మీలాగ మంచి రంగు రాలేదే పాపం’ అంటూ ఆశ్చ‌ర్యాన్ని, సానుభూతిని ఒల‌క‌బోస్తారు. వాళ్ల‌కు గ‌ట్టిగా బ‌దులిస్తే ఏమ‌నుకుంటారోన‌నే భ‌యంతో ఊరుకుంటారు పేరెంట్స్‌.
    నిజానికి త‌మ పిల్ల‌ల‌ను అలా అన్నందుకు అప్ప‌టికే వాళ్ల మ‌న‌సు గాయ‌ప‌డి ఉంటుంది. అయినా త‌మాయించుకుంటారు త‌ప్ప నోరు మెద‌ప‌రు. ఇలాగే ఊరుకుంటే పిల్ల‌లు ‘అమ్మానాన్న‌ల‌కు కూడా నేను న‌ల్ల‌గా ఉన్నాన‌ని బాధ‌గా ఉంది కాబోలు’ అని అపార్థం చేసుకుంటారు. అలాంటి సంద‌ర్భంలో పేరెంట్స్ వెంట‌నే స్పందించాలి. ‘మా పిల్ల‌వాడు ఎంత ప‌ర్‌ఫెక్ట్ అంటే’ అని మొద‌లు పెట్టి పిల్ల‌వాడిలో ఉన్న మంచి ల‌క్ష‌ణాల‌ను ఏక‌రువు పెట్టార‌నుకోండి…. ఎదుటి వారికి కొంత అసంబ‌ద్దంగా అనిపించిన‌ప్ప‌టికీ పిల్ల‌లు సంతోషంగా ఉంటారు. న్యూన‌త‌కు లోనుకారు. త‌మ‌లోని నైపుణ్యాల‌కు పొంగిపోతారు. వాటిని కంటిన్యూ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.
  • ఒక చిన్న ప్ర‌శంస పిల్ల‌ల చేత అద్భుతాల‌ను చేయిస్తుంది. ఒక చిన్న దెప్పి పొడుపు వారిలోని నైపుణ్యాల‌ను హ‌రించి వేస్తుంది. ఒక వ్య‌క్తి రాణించాలంటే రంగు ముఖ్యం కాదు, ముఖ క‌వ‌ళికలు ముఖ్యం కాదు. ఆ ప‌నిలో వారు చూపించిన శ్ర‌ద్ధ‌, ప‌ట్టుద‌ల‌, స్కిల్ ప్ర‌ధాన‌మ‌ని పిల్ల‌లు తెలుసుకునేట‌ట్లు చేయాలి.
  • పిల్ల‌ల‌కు ఇష్ట‌మైన ఎక్స్‌ట్రా క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్‌లో శిక్ష‌ణ ఇప్పించాలి. ప్ర‌తి ఒక్క‌రిలో ఒక క‌సి ఉంటుంది. దానికి ప్రోత్సాహం తోడైతే వాళ్ల ప్ర‌గ‌తిని ఏ చిన్న మాట‌లూ చిన్న‌బుచ్చ‌వు, వాళ్ల‌ను ల‌క్ష్యాన్ని చేర‌కుండా ఏ ఎత్తి పొడుపులూ ఆప‌లేవు.

NEWS UPDATES

CINEMA UPDATES