​​బాబుపై కోస్తా ఎమ్మెల్యేల‌కు కోపం ఎందుకంటే….

839

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిపై కోస్తా ఎమ్మెల్యేలు క‌స్సుబుస్సుమంటున్నారా? ప‌ద‌వుల పందేరం సాగుతున్న తీరుతో హ‌ర్ట‌య్యారా? త‌మ‌కంటే సీమ‌కే బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఫీల‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది ఏపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌ను చూస్తుంటే. అన్ని కీలక పదవులూ రాయలసీమకే దక్కితే ఇక తమ ప్రాంతం మాటేమిటని కోస్తా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.

సహజంగా టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు ఇలాంటి పదవులకు ఎంపిక విషయంలో ప్రాంతాలు, కులాలను బేరీజు వేసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈసారి ఒకే జిల్లా, ఒకే ప్రాంతం వారికి రెండు కీలక పదవులు ఇవ్వాలంటూ తీసుకున్న నిర్ణయం కోస్తా ఎమ్మెల్యేలను ఇలా హ‌ర్ట్ చేసేందుకు కార‌ణం అవుతోంది. శాసనసభ చీఫ్ విప్‌గా అనంత జిల్లా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్‌గా అదే జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బాబు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై త‌మ్ముళ్లు భ‌గ్గుమంటూ పాత లెక్క‌ల‌న్నీ తీస్తున్నారు.

ఇప్పటికే కేబినెట్‌లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు లోకేష్, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు రాయలసీమ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీలో అనంతపురం జిల్లా ఎమ్మెల్యే యామినీబాల, కడప జిల్లా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి విప్‌లుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు అనంతపురం జిల్లాకే మండలి, శాసనసభ చీఫ్ విప్ పదవులు ఇస్తున్నారన్న వార్తలను కోస్తా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు.

మ‌రోవైపు సీనియారిటీ స‌మ‌స్య‌ను సైతం తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నారు. శాసనమండలిలో కేశవ్‌కంటే సీనియర్లు గాలి ముద్దుకృష్ణమనాయుడు, కరణం బలరాం, చిక్కాల రామచంద్రరావు, ఎంవీఎస్ మూర్తి, వైవీబీ రాజేంద్రప్రసాద్ లు ఉన్నారు. వీరిలో ముద్దుకృష్ణమనాయుడు మిన‌హా మిగతా వారంతా కోస్తా ప్రాంతీయులే. కనుక వీరిలో ఎవరో ఒకరికి చీఫ్ విప్ పదవి కట్టబెడితే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. పైగా చీఫ్ విప్ పదవులు రెండూ అగ్రకులాలకే ఇవ్వడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటివరకూ ఎస్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వనందున, రెండిటిలో ఒక పదవి ఆ వర్గానికిస్తే సముచితంగా ఉండేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

NEWS UPDATES

CINEMA UPDATES