ఈ రెడ్లు… టీడీపీకి తలనొప్పిగా మారారు..!

1976

మొన్నేమో దివాకర్ రెడ్డి చంద్రబాబును తెగ పొగిడేశాడు. అయితే ఆ పొగడ్తలతో చంద్రబాబుకు, టీడీపీకి ఉపయోగం కలిగేది ఏమిటో కానీ.. జేసీ మాటలను చంద్రబాబు నాయుడే స్వయంగా ఖండించాల్సి వచ్చింది. చంద్రబాబుతో ముఖేష్ అంబానీ సమావేశం కావడం గురించి జేసీ మాట్లాడుతూ.. చంద్రబాబుతో అంబానికి మంచి స్నేహం ఉందని, చంద్రబాబు నాయుడుని ఇంకా ఉన్నత పదవిలో చూడాలని అంబానీ అనుకుంటున్నాడని జేసీ చెప్పుకొచ్చాడు. ఇంకా ఉన్నత పదవి అంటే.. బహుశా ప్రధానమంత్రి పదవి అని జేసీ భావన.

ఈ రేంజ్ లో చంద్రబాబును మోసేశాడు జేసీ దివాకర్ రెడ్డి. అయితే.. అంబానీ చంద్రబాబును ప్రధానిగా చేయాలని అనుకుంటున్నాడు అనే మాట ఢిల్లీ వరకూ వెళితే అంతే సంగతులు. తనపై బాబు, అంబానీలు కలిసి కుట్ర చేస్తున్నారా? అనే డౌట్ మోడీకి వచ్చిందంటే.. బాబుపై కేసుల ఫైలు కదిలినా కదులుతుంది. అందుకే.. వెంటనే బాబు రంగంలోకి దిగారు. జేసీ వ్యాఖ్యలను తన పార్టీ మీటింగులో ఖండించేశారు.

తనను ఉన్నత పదవిలో చూడాలని అంబానీ ఏమీ అనలేదని.. చాలా సేపు సమావేశం జరిగింది కానీ, అలాంటి మాట ఏమీ రాలేదని పార్టీ మీటింగులో బాబు వివరణ ఇచ్చుకున్నారు. తద్వారా జేసీ చేసిన వ్యాఖ్యానాలను ఖండించే యత్నం చేశాడు చంద్రబాబు. ఇక చంద్రబాబుపై కేంద్రం ఈర్ష పడుతోంది. అసూయ చెందుతోంది అని జేసీ మాట్లాడిన మాటలు కూడా.. బాబుకు ఇబ్బంది పెట్టేవిలానే ఉన్నాయి. ఒక ఎంపీ ఇలా మాట్లాడాడుఅంటే.. బీజేపీ అధిష్టానికి కోపంవచ్చినా రావొచ్చు కదా.

ఇక జేసీ సంగతలా ఉంటే.. ఆదినారాయణ రెడ్డి మాటలు మరింత తలనొప్పి అయ్యాయి. రాజీనామాల గురించి నోరు జారాడు ఆది. కేంద్రం గాని దిగిరాకుంటే మార్చి 5న మా పార్టీ ఎంపీలు రాజీనామా చేసేస్తారని ప్రకటించేశాడు. తలాతోక లేకుండా మాట్లాడే ఈ మంత్రిగారు జగన్ మీద విరుచుకుపడబోయి… టీడీపీకే ఇబ్బందులు తేవడం కొత్త ఏమీ కాదు. చివరకు ఆది మాట్లాడిన మాటలను టీడీపీ ఖండించేసుకుంది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని కవర్ చేసుకుంది. మొత్తానికి ఈ రెడ్లిద్దరూ తమ అత్యుత్సాహంతో మాట్లాడే మాటలతో పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నట్టుగా ఉన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES