టాలీవుడ్‌ వ్యవహారాలపై హైకోర్టులో పిల్

808

టాలీవుడ్‌ను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్‌పై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఏడుగురు మహిళా సామాజిక కార్యకర్తలు ఈ పిల్‌ను దాఖలు చేశారు. పిల్‌లో కోర్టు దృష్టికి అనేక అంశాలను తీసుకెళ్లారు.

టాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులు తీవ్రస్థాయిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి ఏకంగా ఫిల్మ్ చాంబర్‌ ముందు తన దుస్తులు విప్పేసేందుకు సిద్ధపడిదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వివరించారు. పీవో డబ్ల్యూ సంధ్య, మహిళా జర్నలిస్ట్ సజన, పీఏ దేవి, కొండవీటి సత్యవతి, ముక్కపాటి సుమిత్ర, సునీత, మాడభూషి తేజస్విని కలిసి ఈ పిల్‌ను దాఖలు చేశారు.

టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా వాటిపై తెలంగాణ ప్రభుత్వం కనీసస్థాయిలో కూడా స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 12న తాము సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్టు వివరించారు.

చిత్ర పరిశ్రమలో మహిళలు బతకాలంటే అందుకు ప్రతిఫలంగా వారి శీలాన్ని సమర్పించాల్సి వస్తోందని వివరించారు. దాదాపు 5వేల మంది మహిళలు చిత్రపరిశ్రమలో బతుకుతున్నారని…. వారు ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కొంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

మహిళా ఆర్టిస్టుల శ్రమను మధ్యవర్తులు సగం దోచుకుంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో కోర్టు వెంటనే స్పందించి టాలీవుడ్ లో మహిళల కాస్టింగ్ కౌచ్‌పై విచారణకు కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు.

NEWS UPDATES

CINEMA UPDATES