ఇంత డల్ సీజన్ ఈమధ్య ఎప్పుడూ లేదు

310

టాలీవుడ్ లో ప్రతి సీజన్ లో ఏదో ఒక సినిమా ఆడుతుంది. అటు వసూళ్ల పరంగా, టాక్ పరంగా హిట్ అనిపించుకుంటుంది. కానీ ఇప్పుడు నడుస్తున్న డల్ సీజన్ మాత్రం ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. ఇంకా చెప్పాలంటే అర్జున్ రెడ్డి, జై లవకుశ తర్వాత సాలిడ్ హిట్ ఒక్కటి కూడా లేదు.

జులైలో చెప్పుకోవడానికి ఫిదా సినిమా ఉంది. ఆగస్ట్ లో ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి సినిమాలున్నాయి. సెప్టెంబర్ లో జై లవకుశ, మహానుభావుడు సినిమాలున్నాయి. కానీ అక్టోబర్ నుంచి మాత్రం మార్కెట్ పూర్తిగా పడిపోయింది.

అక్టోబర్ లో రాజుగారి గది-2 హిట్ అని ఊదరగొట్టారు. కానీ 3 రోజుల తర్వాత థియేటర్లన్నీ ఖాళీ. ఇక రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ సూపర్ అన్నారు. కానీ రెండో రోజు నుంచే ఖాళీ. ఇక నవంబర్ లో ఏంజెల్, కేరాఫ్ సూర్య సినిమాలు ఆడేస్తాయన్నారు. రెండూ పోయాయి. చివరికి హిట్ టాక్ తెచ్చుకున్న గరుడవేగ కూడా కలెక్షన్లు లేవు.

ఈ వీకెండ్ విడుదలైన సినిమాల పరిస్థితి కూడా అంతే. డిటెక్టివ్, గృహం బాగుందన్నారు. కానీ డబ్బుల్లేవ్. వీటికంటే ముందొచ్చిన అదిరింది మూవీని కూడా అదిరిందన్నారు. అది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఈ నెలలో ఇక చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు.

ఇక డిసెంబర్ లో నాని, అఖిల్ సినిమాలు మాత్రమే రేసులో ఉన్నాయి. ఈ ఏడాదికి అంతో ఇంతో గ్రాండ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటే ఆ రెండే. అవి కూడా అటు ఇటైతే మాత్రం ఈ ఏడాది బాక్సాఫీస్ డల్ గా ముగియాల్సిందే.

 

NEWS UPDATES

CINEMA UPDATES