తెలంగాణ మంత్రుల్లో అసంతృప్తి ? ప‌్ర‌చారంలో క‌నిపించ‌ని జోష్ !

866

కేసీఆర్ 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినది మొద‌లు… తెలంగాణ మంత్రులు మీడియా ముందు క‌నిపించ‌డం లేదు. ఒక్క‌రిద్ద‌రు త‌ప్ప…. ఎవ‌రూ పెద్ద‌గా మీడియాతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించ‌డం లేదు. పైగా మంత్రులు తీవ్ర నిరాశ‌లో, అసంతృప్తిలో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా కేసీఆర్‌తో పాటు చురుగ్గా క‌నిపించే క‌డియం, నాయిని, ఈట‌ల‌, తుమ్మ‌ల లాంటి మంత్రులు అస‌లెక్క‌డా క‌నిపించ‌డం లేదు. ప్ర‌చారంలో మునిగారంటే అదీ లేదు. మ‌రి వీళ్లంత ఎక్క‌డికి వెళ్లార‌నుకుంటున్నారా..? ఉన్నారు..! ఇక్క‌డే ఉన్నారు. కానీ ఎవ‌రూ ప్ర‌చారంలో క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే…. వీళ్లంతా సీఎం కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న‌ట్లు చెబుతున్నారు. క‌నీసం త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా టిక్కెట్లు కేటాయించ‌డంపై కినుక వ‌హించార‌ట‌. పార్టీలో కేసీఆర్‌ను ఎదురించే ధైర్యం లేక‌పోయినా…. పార్టీలో సీనియ‌ర్ నేత‌లుగా, జిల్లాల ఇంఛార్జ్‌లుగా త‌మ‌కు ఓ మాట చెబితే బాగుండేదిగా అని ఫీల‌వుతున్నార‌ట‌.

వాస్త‌వానికి పార్టీలో కొంద‌రు నేత‌లు… మంత్రుల ద్వారా టిక్కెట్లు సంపాదించాల‌ని చూశారు. ఇంకొంద‌రు త‌మ అనుయాయుల‌ను కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు సిఫార‌సు చేయాల‌ని భావించారు. కానీ వారితో ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా…. ఏకంగా 105 మంది పేర్ల‌ను ప్ర‌క‌టించేశారు.

ఇందులో కొంద‌రు మంత్రుల‌కు ప‌డ‌ని వాళ్లుంటే…. అసలు ఏ మాత్రం గెల‌వ‌లేని వాళ్ల‌ను అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. స్వ‌యంగా కేసీఆరే ముప్పై మందిపై వ్య‌తిరేక‌త ఉంది. వాళ్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేయాల‌ని చెబుతున్నారు. కానీ ఇప్పటి కిప్పుడు వారిని గెలిపించ‌డమంటే సాధార‌ణ విష‌యం కాదు. పైగా మంత్రులుగా త‌మ‌కు క‌నీస గౌర‌వం కూడా ద‌క్క‌లేద‌ని బాధ‌ప‌డిపోతున్నారట.

ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్ వెంట న‌డిచిన వాళ్లు కూడా ఇదే భావ‌న వ్య‌క్తం చేశారట. ఇన్నాళ్లు పార్టీలో ఉన్నందుకు క‌నీసం ఓ మాట చెప్పినా బాగుండేద‌ని అంటున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్ చేసిన ప్ర‌తి ప‌నిని స‌మ‌ర్థించామ‌ని…. కానీ ఈ విష‌యంలో ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌ని తెలిసిన‌వాళ్ల ద‌గ్గ‌ర వాపోతున్నార‌ట‌.

పైకి న‌వ్వుతూ క‌నిపిస్తున్నా… కొంద‌రు ద‌గ్గ‌రి వాళ్ల వద్ద క‌డుపులో ఉన్న‌దంతా క‌క్కేస్తున్నార‌ని చెబుతున్నారు. అందుకే ఒక‌రిద్ద‌రు మంత్రులు త‌ప్ప…. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. అటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ గ‌డ‌పా తొక్క‌డం లేదు.

NEWS UPDATES

CINEMA UPDATES