ఆంధ్రా పేరుచెప్పి దారికి తెచ్చుకుంటున్నారు

884

“ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తివి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావ్‌. న‌ల్ల‌గొండ బ్యాంకు నీదా? ఆయ‌న‌దా? ఇద్ద‌రు క‌లిసి దోచుకుంటున్నారు. నీకేమైనా డ‌బ్బులు కావాలంటే అడుగు ఇస్తాను. నాతో మాట్లాడుతున్న‌ప్పుడు ఛైర్మ‌న్ మాట ఎత్తొద్దు. బైలా ప్ర‌కారం న‌డుచుకో. లేదంటే మంత్రి.. ముఖ్య‌మంత్రికి కంప్లైంట్ చేస్తా. సోమ‌వారం లోపు ప‌ని పూర్తి చేయాలి. మ‌ల్లికార్జున్ నీదగ్గ‌ర‌కు వ‌స్తాడు. ప‌ని చేసేయ్‌. చేయ‌కపోతే అర‌గంట‌లో నీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తా” ఈ మాట‌ల‌న్నీ న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే.. అధికార టీఆర్ఎస్‌కు చెందిన‌ వేముల వీరేశం నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు.

త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా ప‌ని చేయ‌ని అధికారుల్లోని ఆంధ్రా యాంగిల్‌ను బ‌య‌ట‌కు తీసి బెదిరించి ప‌నులు చేయించుకోవ‌టంలో ఘ‌నుడ‌న్న పేరున్న ఎమ్మెల్యే… తాజా ఉదంతంలో అడ్డంగా ఫిక్స్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ ఎమ్మెల్యేకు చెందిన ఆడియో టేపులు తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. డీసీసీబీలో స‌స్సెండ్ అయిన ఒక అధికారి రీపోస్టింగ్ వ్య‌వ‌హారంలో సీఈవో మ‌ద‌న్ మోహ‌న్ పై అధికార‌పార్టీ ఎమ్మెల్యే తిట్టిన తిట్ల సీడీ బ‌య‌ట‌కు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

రెండేళ్ల క్రితం న‌ల్ల‌గొండ జిల్లా దేవ‌ర‌కొండ డీసీసీబీ బ్రాంచ్‌లో రూ.12 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఈ కేసులో 21 మంది అధికారులు.. ఉద్యోగుల‌కు ప్ర‌మేయం ఉండ‌టంతో ముగ్గురు సీఈవోల‌తో పాటు డీజీఎం ల‌క్ష్మ‌మ్మ‌ను స‌స్పెండ్ చేశారు. అయితే.. త‌న‌కు రీపోస్టింగ్ లో లేటు చేస్తున్నారంటూ న‌కిరేక‌ల్ ఎమ్మెల్యేను ల‌క్ష్మ‌మ్మ ఆశ్ర‌యించారు. త‌న‌కు రీ పోస్టింగ్ ఇవ్వ‌కుండా జాప్యం చేయ‌టానికి సీఈవో మ‌ద‌న్ మోహ‌న్ కార‌ణంగా ఆమె ఆరోపించారు.

ఈ విష‌యంపై ఎమ్మెల్యే మాట్లాడ‌గా.. పోస్టింగ్ వ్య‌వ‌హారం త‌న ప‌రిధిలో లేద‌ని చెప్పిన సీఈవో.. ఫైల్‌ను ఛైర్మ‌న్ కు పంపుతాన‌ని.. ఆయ‌న ఫైన‌ల్ చేస్తార‌ని చెప్పారు. దీనిపై ఆగ్ర‌హం చెందిన ఎమ్మెల్యే ఛైర్మ‌న్ వ్య‌వ‌హారం త‌న వ‌ద్ద‌కు తేవొద్ద‌ని.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్య‌క్తి ఇక్క‌డ‌కు వ‌చ్చి త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిప‌డ్డారు. దీనికి సంబంధించిన సీడీ ఇప్పుడు విడుద‌ల కావ‌టంతో ఎమ్మెల్యే గ‌తుక్కుమంటున్నారు.

తాను మాట్లాడిన మాట‌ల్ని ఎడిట్ చేశార‌ని చెబుతున్న ఎమ్మెల్యే.. ఆంధ్రా ప్రాంతం ముచ్చ‌ట ఎందుకు ప్ర‌స్తావించాల‌న్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. ఇష్టారాజ్యంగా చేయ‌టం.. త‌మ‌కు తోచిన‌ట్లుగా చేయాల‌ని ఆదేశించే నాయ‌కుల‌కు.. నిజాయితీగా ప‌ని చేసే అధికారుల‌కు ఆంధ్రా ప్రాంత‌మంటూ తోక‌లు త‌గిలిస్తూ ఇబ్బంది పెడుతున్నార‌న్న విమర్శ‌ల‌కు తాజా ఎపిసోడ్ మంచి ఉదాహ‌ర‌ణ అవుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి వాటిపై కేసీఆర్ క‌న్నెర్ర చేయ‌కుంటే ప్ర‌భుత్వ ఇమేజ్ డ్యామేజ్ కావ‌టం ఖాయ‌మంటున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES