బాబుకు అంతసీన్‌ లేదు …. ముందు జగన్‌ వద్దకే వచ్చారు

3141

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను వివరించారు. పోలవరం పైనా స్పందించిన ఉండవల్లి… పోలవరం విషయంలో చంద్రబాబు సెల్ఫ్‌గోల్ వేసుకున్నారని చెప్పారు. పోలవరం బాధ్యతను కేంద్రానికి ఇచ్చి ఉంటే ఎన్ని వేల కోట్లు అయినా నిర్మించి ఇచ్చేదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్లే అసలు ఇబ్బందులు వచ్చాయన్నారు.

ప్రాజెక్ట్‌ వ్యయం అమాంతం పెరిగిపోయిందని…. కేంద్రం మాత్రం పెరిగిన వ్యయంతో తమకు సంబంధం లేదని.. 2014 లెక్కల ప్రకారమే నిధులిస్తామంటోందన్నారు. మరి మిగిలిన డబ్బు ఎవరు భరించాలని ఉండవల్లి ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పని వల్లే ఇప్పుడు పోలవరం సంక్షోభంలో పడిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని చంద్రబాబు చెబుతున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదన్నారు. పదింటిలో నెగ్గి.. ఒక ముడింటిలో తగ్గితే అప్పుడు చంద్రబాబు మాటలు నమ్మేందుకు అవకాశం ఉండేదన్నారు.

కానీ ఇప్పటి వరకు కేంద్రం వద్ద ఒక్క విషయంలోనైనా చంద్రబాబు నెగ్గారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ప్రజాప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నానని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఓటుకు నోటుకు మించిన చంద్రబాబు వీక్‌నెస్‌ ఏదో కేంద్రానికి దొరికిందన్నారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతారన్న భయం చంద్రబాబుకు ఉందన్నారు. మోడీకి భార్యపిల్లలు లేరని.. ఆయనకు రాజకీయం మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు పరిస్థితి అందుకు భిన్నమన్నారు.

చంద్రబాబు ఒళ్లంతా కుంభకోణాలేనని కాబట్టి చంద్రబాబు భయపడుతూ ఉండక తప్పదన్నారు. పనుల్లో అవినీతి జరగడం .. అవినీతి కోసమే పనులు చేయడం రెండూ వేర్వేరు అంశాలన్నారు. ఇప్పుడు అవినీతి కోసమే పనులు చేస్తున్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు. చంద్రబాబుపై తాను చేస్తున్న విమర్శల వల్ల వైసీపీకి లాభం జరగవచ్చని.. కానీ తాను వైసీపీ కోసమే చంద్రబాబును విమర్శించడం లేదన్నారు. తన అంచనా ప్రకారం బీజేపీతో జగన్‌ కలిసే అవకాశమే లేదన్నారు.

జగన్‌కు ఉన్న ఓటు బ్యాంకు అంతా మైనార్జీలు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకేనన్నారు. వారు బీజేపీని అంగీకరించరని.. ఆ విషయం జగన్‌కు కూడా తెలుసన్నారు. నిజానికి 2014 ఎన్నికలకు ముందు తొలుత బీజేపీ పెద్దలు జగన్‌ వద్దకే వచ్చారన్నారు. కానీ బీజేపీతో పొత్తుకు జగన్‌ అంగీకరించలేదని… ఆ తర్వాతే చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందన్నారు. ఆ విషయం తనకు బాగా తెలుసన్నారు. చంద్రబాబు ఒంగిఒంగి దండాలు పెడుతున్నా మోడీ మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు.

ఇది చాలా అవమానకరమైన అంశమన్నారు. ఒక ప్రధాని.. ఒక ముఖ్యమంత్రికి ఏడాదిన్నరగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటే ఏమనుకోవాలన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఒంగిఒంగి దండాలు పెట్టడం మానేసి… బల్ల గుద్ది ప్రశ్నించాలన్నారు. అలా చేయని పక్షంలో చరిత్ర చంద్రబాబును క్షమించదన్నారు. ఏడాదిన్నరగా మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని బయటకు చెప్పకోవడమే సిగ్గుచేటన్నారు ఉండవల్లి.

NEWS UPDATES

CINEMA UPDATES