క్లారిటీ వచ్చేసింది…. పవన్‌ను కడిగేసిన వాసిరెడ్డి పద్మ

2962
vasireddy padma, pawan kalyan chandrababu naidu ycp prp 2019 elections

విశాఖ పర్యటనలో పవన్‌ కల్యాణ్‌… చంద్రబాబును ప్రశ్నించకుండా తిరిగి ప్రతిపక్షంపైనే విమర్శలు చేయడం పట్ల వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. చంద్రబాబును మరోసారి అధికారంలో కూర్చోబెట్టేందుకు పవన్‌ కల్యాణ్ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. అందుకే పవన్‌ కల్యాణ్ అతి తెలివితో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను సీఎం అయ్యే అవకాశం లేదని పవన్‌ కల్యాణ్‌కు తెలుసుకాబట్టే … తనకు సీఎం పదవి వద్దంటూ మాట్లాడుతున్నారని అన్నారు.

గతంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్ అందరూ కలిసి పార్టీ పెట్టినప్పుడే పీఆర్పీకి 18 శాతం ఓట్లు వచ్చాయని.. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే తనకు ఆ ఓట్లు కూడా రావన్న విషయం పవన్‌ కల్యాణ్‌కు బాగా తెలుసన్నారు. అందుకే చంద్రబాబును 2019లో కూడా గెలిపించేందుకు కొత్త నాటకం మొదలుపెట్టారు. జగన్‌ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌కు అసలు ఏ విలువలున్నాయని ప్రశ్నించారామె. మూడు పెళ్లిళ్ల వ్యవహారం చూసి పవన్ దగ్గర విలువలు నేర్చుకోవాలా అని ప్రశ్నించారు.

నడిరోడ్డుపై పార్టీని అమ్మిన చరిత్రను చూసి నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల క్రితం తన అన్నకు అన్యాయం జరిగిందని.. అలా అన్యాయం చూసి కడుపు మండిందంటున్న పవన్ కల్యాణ్… మరి నాలుగేళ్లుగా చంద్రబాబు అరాచకపాలనతో జనం పడుతున్న కష్టాలను చూసినప్పుడు కడుపు మండలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి ఏ తాయిలాలు తీసుకుని కడుపు మంట చల్లార్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. సేవ చేయడానికి సీఎం పదవే అక్కర్లేదంటున్న పవన్‌ కల్యాణ్.. మరి 2009లో ఏ ఉద్దేశంతో పీఆర్పీని పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. కేవల మూడేళ్లలో చంద్రబాబు ఏకంగా లక్షా 20వేల కోట్ల అప్పు చేస్తే అది ఎక్కడికి వెళ్లిందో పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

కేవలం ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి చంద్రబాబుకు తిరిగి అధికారం అప్పగించేందుకే పవన్‌ కొత్త నాటకాలు ఆడుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని అవమానించి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే పవన్‌ కల్యాణ్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఒక వైపు పీఆర్పీ అధికారంలోకి వచ్చి ఉంటే కొత్త రాజకీయం చేసేవారిమని చెబుతూనే.. సేవ చేయాలంటే సీఎం పదవే ఉండాల్సిన అవసరం లేదని పవన్‌ కల్యాణ్ మాట్లాడడం బట్టే ఆయన అజ్ఞానం అర్థమవుతోందన్నారు.

పవన్‌ కల్యాణ్ అతి తెలివితో మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌ కల్యాణ్ ఇప్పటికీ కూడా చెప్పడంలేదని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. చంద్రబాబు నాలుగేళ్లుగా అరాచకపాలన చేస్తుంటే ప్రశ్నించకుండా పవన్‌ కల్యాణ్ నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయారా అని నిలదీశారు.

ఇకపై చంద్రబాబు తరహాలోనే పవన్‌ కల్యాణ్‌ను కూడా ప్రశ్నిస్తామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక వేల కోట్లు కమీషన్ల రూపంలో చేతులు మారుతుంటే ఎందుకు స్పందించలేదని పవన్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపులతో దొరికినా దానిపై ఎందుకు ప్రశ్నించలేదని పద్మ నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న పాపాల్లో చంద్రబాబుకు ఎంత వాటా ఉందో పవన్‌ కల్యాణ్‌కు కూడా అంతే బాధ్యత ఉందన్నారు. చంద్రబాబును తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పవన్‌ కల్యాణ్ చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తూనేఉన్నారన్నారు. ప్రజలను ఇలాంటి నాటకాలను చూసి ఒకసారి మోసపోతారు గానీ పదేపదే మోసపోయే పరిస్థితి ఉండదన్నారు. మొన్నటి ఎన్నికల్లో అందరూ కలిసి వచ్చినా వైసీపీ కేవలం ఒక శాతంఓట్లతో ఓడిపోయిందన్నారు. ఈసారి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని ఎత్తులు వేసినా వైసీపీ గెలుపును మాత్రం ఆపలేరన్నారామె.

NEWS UPDATES

CINEMA UPDATES