మహిళా టెండుల్కర్ మిథాలీ రాజ్….

3313

మిథాలీరాజ్… ప్రపంచ మహిళా క్రికెట్లో గత 24 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్. డ్యాన్సర్ కాబోయి క్రికెటర్ గా మారిన మిథాలీ.. 11 సంవత్సరాల చిరుప్రాయంలోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టింది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ తనదైన శైలిలో రాణిస్తూ…. భారత మహిళా క్రికెట్ టెండుల్కర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

అరుదైన రికార్డులు…

గత రెండున్నర దశాబ్దాలుగా క్రికెట్ కెరియర్ కొనసాగిస్తూ వస్తున్న మిథాలీ వన్డే క్రికెట్లో ….6 వేల పరుగుల మైలురాయి చేరిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.

ఐర్లాండ్ ప్రత్యర్థిగా 1999 లో వన్డే అరంగేట్రం చేసిన మిథాలీ…194 మ్యాచ్ లు ఆడి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ ప్లేయర్ చార్లొట్టి ఎడ్వర్డ్స్ పేరుతో ఉన్న 191 వన్డే ప్రపంచ రికార్డును తెరమరుగు చేసింది.

వరుసగా ఏడు హాఫ్ సెంచరీల రికార్డు….

వన్డే క్రికెట్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించిన తొలిమహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ మాత్రమే. మిథాలీ ఇప్పటి వరకూ ఆడిన 194 మ్యాచ్ ల్లో ఆరు సెంచరీలు, 50 అర్థసెంచరీలతో సహా మొత్తం 6 వేల 373 పరుగులు సాధించింది. మహిళా క్రికెట్ చరిత్రలోనే వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా కూడా మిథాలీ నిలిచింది.

ప్రపంచకప్ లో 1000 పరుగులు….

2005 ప్రపంచకప్ లో మిథాలీ నాయకత్వంలోనే భారతజట్టు ఫైనల్స్ చేరి…. రన్నరప్ గా నిలిచినా తగిన గుర్తింపు, ఆదరణ, ప్రోత్సాహం లభించలేదు.

అయితే ..ఐసీసీ విధానాలు, నిబంధనల పుణ్యమా అంటూ…. బీసీసీఐ పరిథిలోకి మహిళా క్రికెట్ సైతం వచ్చి చేరడంతో ..పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. పురుషుల క్రికెట్ తో సమానంగా ఆధునిక శిక్షణ సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో…మిథాలీ మాత్రమే కాదు..భారత మహిళా క్రికెట్ సైతం తేరుకోగలిగింది.

ఇంగ్లండ్ వేదికగా ఇటీవలే ముగిసిన 2017 మహిళా వన్డే ప్రపంచకప్ లో…నాలుగోర్యాంక్ జట్టుగా బరిలోకి దిగిన భారత్ ను… ఫైనల్స్ చేర్చడంలో కెప్టెన్ గా, స్పెషలిస్ట్ బ్యాట్స్ విమెన్ గా మిథాలీరాజ్ ప్రధాన పాత్ర వహించింది.

ప్రపంచకప్ లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన భారత తొలి క్రికెటర్ మాత్రమే కాదు…మహిళా క్రికెట్ చరిత్రలో ఐదవ ప్లేయర్ గా మిథాలీ గుర్తింపు తెచ్చుకొంది. 

అవార్డుల కొండ మిథాలీ

వన్డే క్రికెట్లో అత్యధిక విమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొన్న ప్లేయర్ల వరుసలో మిథాలీ రెండవస్థానంలో నిలిచింది. మిథాలీ మొత్తం 18సార్లు అత్యుత్తమ ప్లేయర్ అవార్డులు గెలుచుకొంది.

వెస్టిండీస్ ప్లేయర్ స్పెఫానీ టేలర్ 20సార్లు విమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో అగ్రస్థానంలో నిలిస్తే… మిథాలీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది.

ఇక… వన్డే క్రికెట్లో 18 సంవత్సరాలపాటు కొనసాగిన భారత ఏకైక ప్లేయర్ మిథాలీ రాజ్ మాత్రమే.

టెస్ట్ క్రికెట్లో రెండో అత్యధిక స్కోరు…

కేవలం 10 టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడిన మిథాలీ ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో సహా..663 పరుగులు సాధించింది. ఇందులో 214 పరుగులు అత్యధిక స్కోరుగా ఉంది. మహిళా టెస్ట్ క్రికెట్లో మిథాలీ సాధించిన 214 పరుగులే …రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదయ్యింది.

టీ-20 క్రికెట్లో 2వేల రికార్డు…

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ ఫార్మాట్లలో మాత్రమే కాదు…నవతరం టీ-20 క్రికెట్లో సైతం మిథాలీ తన ప్రత్యేకత చాటుకొంటూ వస్తోంది.

మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ఇటీవలే ముగిసిన 2018 ఆసియాకప్ టీ-20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్ ద్వారా మిథాలీ 2వేల పరుగుల రికార్డు సాధించింది. మొత్తం 75 మ్యాచ్ ల్లో 14 హాఫ్ సెంచరీలతో సహా 2వేల 15 పరుగులు సాధించింది.

38.01 సగటుతో ఉన్న మిథాలీ…పురుషుల కెప్టెన్ విరాట్ కొహ్లీకి సైతం సాధ్యం కాని రికార్డు సాధించింది. టీ-20 క్రికెట్లో విరాట్ కొహ్లీకి సైతం ఇప్పటి వరకూ 2వేల పరుగుల రికార్డు లేకపోవడం విశేషం.

మిథాలీ కష్టానికి తగ్గ ఫలం…

36 సంవత్సరాల వయసులో సైతం క్రికెటర్ గా తన కెరియర్ కొనసాగిస్తున్న మిథాలీ…తనకు ఇష్టమైన క్రికెట్ కోసమే వివాహాన్ని వాయిదా వేసుకొంటూ వచ్చింది. ఏమాత్రం ప్రోత్సాహం లేకపోయినా…రెండు దశాబ్దాల తన క్రికెట్ కష్టానికి…తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడు పొందుతూ వస్తోంది.

ఇంగ్లండ్ వేదికగా గత ఏడాది ముగిసిన మహిళా ప్రపంచకప్ మ్యాచ్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కావడం, భారతజట్టు ఫైనల్లో పోరాడి ఓడటంతో…గతంలో ఎన్నడూలేనంత ప్రచారం, గుర్తింపు వచ్చాయి.

భారతజట్టు సెమీస్ చేరడంతోనే…బీసీసీఐ ఒక్కో ప్లేయర్ కు 50 లక్షల రూపాయలు, సహాయక సిబ్బందికి 25 లక్షల రూపాయల చొప్పున నజరానాగా ప్రకటించింది.

అంతేకాదు…మిథాలీతో సహా భారతజట్టులోని పదిమంది రైల్వే ప్లేయర్లకు సైతం….ఇండియన్ రైల్వేస్ తలో 13 లక్షల రూపాయలు ప్రోత్సాహక బహుమతి, ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి సత్కరించింది.

తెలంగాణా ప్రభుత్వం సైతం తమ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన మిథాలీకి కోటిరూపాయల నజరానాతో పాటు…బంజారాహిల్స్ లో 600 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించి మరీ ప్రోత్సహించింది.

NEWS UPDATES

CINEMA UPDATES