విశ్వక్రీడా వేదికపై భారత మెరుపు తీగలు….

2304
  • ఆర్చరీలో దీపిక కుమారి
  • షూటింగ్ లో మను బాకర్
  • పరుగులో హిమ దాస్
  • జిమ్నాస్టిక్స్ లో దీప కర్మాకర్

క్రీడలు ఏవైనా…భారత నవతరం క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో వెలిగిపోతున్నారు. చిన్నవయసులోనే పెద్దవిజయాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, విలువిద్య, జిమ్నాస్టిక్స్ లాంటి వైవిద్యభరితమైన క్రీడల్లో బంగారు పతకాలు సాధిస్తూ భారత యువతులా…. మజాకానా…. అనిపించుకొంటున్నారు.

జిమ్నాస్టిక్స్, షూటింగ్, విలువిద్య, పరుగు….పరస్పర విరుద్ధమైన భిన్నరకాల క్రీడలు. ధనిక దేశాల క్రీడాకారులు మాత్రమే రాణించే ఈ క్రీడల్లో భారత నవతరం క్రీడాకారులు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు.

అసోం ఎక్స్ ప్రెస్ హిమ దాస్, హర్యానా బుల్లెట్ మను బాకర్, జార్ఖండ్ గోల్డెన్ యారో దీపిక కుమారి, త్రిపుర మెరుపుతీగ దీప కర్మాకర్ ప్రపంచ పతకాలతో సరికొత్త చరిత్రకు నాంది పలికారు.

అసోం ఎక్స్ ప్రెస్ హిమ దాస్….

 ఫిన్లాండ్ లోని టాంపారే వేదికగా ముగిసిన 2018  ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల అండర్ -20 విభాగం 400 మీటర్ల పరుగులో…భారత రన్నర్ హిమ దాస్ స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించింది.

400 మీటర్ల దూరాన్ని 18 ఏళ్ల హిమదాస్ 51. 46 సెకన్ల సమయంలో పూర్తి చేసి…. విజేతగా నిలిచింది. ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో స్వర్ణ పతకం సాధించిన భారత తొలి మహిళగా, అథ్లెట్ గా రికార్డు నెలకొల్పింది.

సాకర్ నుంచి పరుగుకు….

అసోంలోని నగావ్ జిల్లా డింగ్ గ్రామంలోని…ఓ నిరుపేద రైతుకుటుంబంలో జన్మించిన హిమ దాస్…ఫుట్ బాల్ తో తన కెరియర్ ప్రారంభించి…చివరకు అథ్లెటిక్స్ ను ఎంచుకొంది. మగపిల్లలతో కలసి వరిపొలాల్లో ఫుట్ బాల్ ఆడుతూ… లేడిపిల్లలా మెరుపువేగంతో పరుగు పెట్టిన హిమ దాస్ లోని ప్రతిభను గుర్తించిన కోచ్ నిపోన్ దాస్… అంతర్జాతీయ అథ్లెట్ గా తీర్చి దిద్దారు.

తమ గ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలోని గౌహతీలోని క్రీడాప్రాథికార సంస్థ లో శిక్షణ పొందిన హిమ … 100, 200 మీటర్ల పరుగులో తన సత్తా చాటుకొంది. ఆ తర్వాత 400 మీటర్ల పరుగుపై దృష్టి కేంద్రీకరించింది.

ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించడం తో…. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ జట్టులో చోటు సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్ లో 6వ స్థానం సంపాదించిన హిమ…. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ లో ఏకంగా బంగారు పతకమే అందుకొంది.

2002 ప్రపంచ మీట్ మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, 2014 ప్రపంచ మీట్ లో నవ్ జీత్ కౌర్ ధిల్లాన్ కాంస్య పతకాలు మాత్రమే సాధిస్తే…. ఆ ఇద్దరి రికార్డులను హిమా దాస్…. స్వర్ణ పతకంతో తెరమరుగు చేసింది.

ఇండోనేషియా వేదికగా జరిగే 2018 ఆసియా క్రీడల పరుగులో సైతం బంగారు పతకం సాధించగలనన్న ధీమాతో సిద్ధమవుతోంది.

త్రిపుర మెరుపుతీగ దీప కర్మాకర్….

జిమ్నాస్టిక్స్ మహిళల విభాగంలో ఈశాన్య భారత రాష్ట్రం త్రిపుర అందించిన ఆణిముత్యం దీప కర్మాకర్. రియో ఒలింపిక్స్  మహిళల జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ విభాగంలో నాలుగోస్థానంలో నిలవడం ద్వారా…. అందరి దృష్టిని ఆకర్షించిన 24 ఏళ్ల దీపకు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకాలు సాధించిన రికార్డు ఉంది.

అయితే ఇటీవలే టర్కీ  వేదికగా ముగిసిన ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ వరల్డ్‌ చాలెంజ్‌ కప్‌లో దీప…. వాల్ట్‌ విభాగంలో స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్‌ ప్రపంచకప్‌ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్‌గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది.

బంగారు బాణం దీపిక కుమారి….

జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నుంచి ప్రపంచ విలువిద్యలోకి దూసుకొచ్చిన బంగారు బాణమే 24 ఏళ్ల దీపిక కుమారి. సాల్ట్ లేక్ సిటీ వేదికగా ముగిసిన 2018 ప్రపంచకప్ గ్రూప్-3 రికర్వ్ మహిళల ఫైనల్లో… మిషెల్లీ క్రోపెన్ ను 7-3తో ఓడించడం ద్వారా దీపిక కుమారి…. ఆరేళ్ల విరామం తర్వాత బంగారు పతకం అందుకొంది.

అంటాల్యా వేదికగా 2012లో ముగిసిన ప్రపంచకప్ విలువిద్య పోటీల్లో బంగారు పతకం సాధించిన తర్వాత…మరో స్వర్ణం కోసం దీపిక నాలుగేళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది.

రాంచీ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోని మారుమూల గ్రామం రటు చాటీకి చెందిన దీపిక తండ్రి ఆటో డ్రైవర్ కాగా, తల్లి ఆస్పత్రిలో నర్సుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే…తమ కుమార్తెను విలువిద్యలో ప్రోత్సహించారు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ప్రపంచస్థాయి ఆర్చర్ గా తీర్చిదిద్దారు.

2 స్వర్ణాలు, 4 రజతాలు

2011, 2012, 2013, 2015 ప్రపంచ విలువిద్య పోటీల్లో రజత విజేతగా నిలిచిన దీపిక..ఈ ఏడాది టర్కీలోని శాంసున్ వేదికగా జరిగే ప్రపంచకప్ ఫైనల్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. గతంలో… ఆరుసార్లు ప్రపంచకప్ ఫైనల్లో పాల్గొన్న దీపికకు 2 స్వర్ణాలు, 4 రజత పతకాలు సాధించిన రికార్డు ఉంది.

కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన దీపిక…ఒలింపిక్స్ కు అర్హత సాధించినా…. స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతోంది. ఇప్పటికే అర్జున పురస్కారం అందుకొన్న దీపిక కుమారి…. వచ్చే ఒలింపిక్స్ లో ఏదో ఒక పతకం సాధించి తీరాలన్న పట్టుదలతో తన సాధన కొనసాగిస్తోంది. 

హర్యానా బుల్లెట్ మను బాకర్….

మను బాకర్…ప్రపంచ షూటింగ్ లో 16 ఏళ్ల ఈ భారత యువషూటర్ పేరు మార్మోగిపోతోంది. హర్యానాలోని జజ్జర్ జిల్లా గోరియా గ్రామానికి చెందిన మను… మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ క్రీడల్లో పతకాలు సాధించిన రికార్డు ఉంది. ఆ తర్వాత…. పిస్టల్ షూటింగ్ లో ప్రవేశించింది.

ప్రపంచ షూటింగ్ 10 మీటర్ల పిస్టల్ విభాగంలో బంగారు, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ 10 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా అంతర్జాతీయస్థాయి షూటర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

అంతేకాదు…. జర్మనీలో వేదికగా ముగిసిన 2018 ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌లో మను సరికొత్త ప్రపంచ రికార్డుతో పసిడి పతకం అందకొంది. 24 షాట్ల ఫైనల్లో  242.5 పాయింట్లు సాధించడం ద్వారా జూనియర్‌ స్థాయిలో మను ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుత సీజన్లో మనుకు ఇది ఏడో అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణం కావడం విశేషం. ప్రపంచ రికార్డు ప్రదర్శనతో మను స్వర్ణ పతకం అందుకోడం ఇది మూడోసారి.

రానున్న ఆసియా క్రీడలు, టోక్యో ఒలింపిక్స్ తో పాటు ఇతర అంతర్జాతీయ పోటీలలో…ఈ నలుగురు మెరికలు బంగారు పతకాల పంట పండించాలని కోరుకొందాం.

NEWS UPDATES

CINEMA UPDATES