✓ గోదావరి జిల్లాల రిజల్ట్ ఆధారంగా జగన్‌ చెప్పిన లాజిక్

2127

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను జగన్ వ్యక్తం చేశారు. తన పాదయాత్రలో ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, రైతులు వచ్చి వినతిపత్రాలు ఇస్తున్నారని జగన్ చెప్పారు. తాను అధికారంలో లేనని తెలిసినా వినతిపత్రాలు ఇస్తున్నారంటే జనంలో కూడా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్న నమ్మకం ఏర్పడిందన్నారు జగన్.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల తీర్పును గమనిస్తే.. ఇక్కడి ప్రజలు ఎప్పుడు కూడా ఏకపక్షంగానే తీర్పు ఇస్తారన్నారు. 1999లో వైఎస్‌ ప్రతిపక్ష నేతగా ఉంటూ కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్లగా.. తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌కు ఒకస్థానం మాత్రమే వచ్చిందన్నారు. జక్కంపూడి రామ్మోహన్‌రావు మాత్రమే గెలిచారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జీఎస్‌ రావు మాత్రమే కాంగ్రెస్‌ తరపున గెలిచారన్నారు. అదే 2004 వచ్చే సరికి తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌కు ఏకంగా 19 స్థానాలు వచ్చాయని గుర్తు చేశారు.

టీడీపీకి ఒక సీటు మాత్రమే దక్కిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ 12 స్థానాలను సొంతం చేసుకుందన్నారు. 2014 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు వేశారన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం సీన్ మరోలా ఉంటుందన్నారు. 2004 ఫలితమే తిరిగి పునరావృతమవుతుందన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబుకు ఊహించని స్థాయిలో వచ్చే ఎన్నికల్లో షాక్ తగలబోతోందన్నారు.

అధికారం లేకపోయినా ప్రజలు వచ్చి తనకు వినతిపత్రాలు ఇస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవడన్న విషయం జనానికి కూడా అర్థమవడమేనన్నారు జగన్‌. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే తాము అసెంబ్లీని బహిష్కరించామన్నారు. ఫిరాయింపుదారులపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని నాలుగేళ్ల పాటు ఎదురుచూశామని…. కానీ చర్యలు తీసుకోకపోవడంతోనే సభను బహిష్కరించామని జగన్ చెప్పారు.

NEWS UPDATES

CINEMA UPDATES