మీడియాతో చిట్‌చాట్ … పవన్‌పై జగన్ డైరెక్ట్ అటాక్, సంచలన ప్రశ్నలు

3785
ys jagan question to pawan kalyan padayatra vizag chandrababu naidu politics

2019 ఎన్నికల్లో ఎవరి లైన్ ఏంటి అన్నది స్పష్టత వస్తోంది. విశాఖలో పర్యటించిన పవన్‌ కల్యాణ్…. ఎప్పటి లాగే చంద్రబాబు పట్ల మెతకవైఖరి ప్రదర్శించారు. అదే సమయంలో వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల అవినీతి చేసిన జగన్‌ను చూసి భయపడే తాను టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పారు.

వైఎస్ హయాంలో మంచితో పాటు అవినీతి కూడా జరిగిందన్నారు. మరికొన్ని విమర్శలు కూడా వైసీపీపై చేశారు పవన్. అంతే కాదు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చాలా రోజుల క్రితమే వైసీపీ షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంది. వైసీపీ ప్రజాప్రతినిధుల పర్యటనకు కొద్ది గంటల ముందే హఠాత్తుగా పవన్‌ కల్యాణ్‌ కూడా పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ తీరుపై పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్…. తమ ఛానల్ ప్రతినిధి వద్ద ఘాటు వ్యాఖ్యలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ వెల్లడించింది.

సీఎం పదవికి అనుభవం ఉండాలి.. అది చంద్రబాబులో ఉందని చెప్పిన పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలను జగన్ ఖండించారు. అలాంటప్పుడు ఏ అనుభవం ఉందని 2009లో చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి పీఆర్పీని స్థాపించారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి గానీ, పవన్‌ కల్యాణ్‌కు గానీ ఎలాంటి అనుభవం లేదు కదా అని గుర్తు చేశారు. వైఎస్ హయాంలో అవినీతి జరిగిందన్న పవన్ ఆరోపణలకూ జగన్ స్పందించారు. వైఎస్‌ హయాంలో ఎక్కడ అవినీతి జరిగిందో పవన్ స్పష్టంగా చెప్పాలన్నారు.

ఎవరో చెప్పింది విని ఊహించుకుని మాట్లాడడం సరికాదన్నారు. ఒకవేళ వైఎస్‌ పాలనలో అవినీతి జరిగి ఉంటే అదే కాంగ్రెస్‌ పార్టీలోకి పీఆర్పీని ఎలా విలీనం చేశారని ప్రశ్నించారు. పార్టీ విలీనంలో జరిగిన అవినీతి ఏంటో బయటకు చెప్పాలన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించేందుకు వస్తున్నారని తెలిసే పవన్ కల్యాణ్ కూడా హడావుడిగా పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారని జగన్ విమర్శించారు.

ప్రశ్నిస్తా అంటున్న పవన్‌ కల్యాణ్‌.. రెండు మూడు రోజులు హడావుడి చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతారని…. ఇది నాలుగేళ్లుగా జరుగుతున్నదేనని జగన్ వ్యాఖ్యానించారు. తొలి నుంచి కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీ ఒక వైసీపీ మాత్రమేనన్నారు. అసలు నాలుగేళ్లుగా ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా సరే టీడీపీని ప్రశ్నించకుండా.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించడం ఏమిటని జగన్‌ నిలదీశారు. ఇందంతా చంద్రబాబు ఆడిస్తున్ననాటకమేనని జగన్ తేల్చిచెప్పారు. తామేమి ఎవరి పొత్తు కోసం పాకులాడడం లేదని.. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు సిద్ధమని జగన్‌ చెప్పారు.

NEWS UPDATES

CINEMA UPDATES