ఇప్పుడు నిద్రపోండి…. ఎలక్షన్ల తరువాత ఏడుద్దురు….

1816

వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిన చోట 10లక్షల కుంభకోణం చేస్తే అది చాలా చిన్న వ్యవహారం.. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయం తెలియకుండానే మనుషుల్లో ఏర్పడడం సహజం. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మెడలో కండువా వేసి చంద్రబాబు లాక్కెళ్లిన తర్వాత… ఏపీలో అనేక విషయాల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహస్యం అవుతున్నా… ఎమ్మెల్యేలను, ఎంపీలనే కొనేసిన దాంతో పోలిస్తే ఇవన్నీ చిన్నవే కదా అన్న భావన తెలియకుండానే ఏర్పడుతుంది. ప్రజలను ఈ మానసిక స్థితికి తీసుకెళ్లడంలో చంద్రబాబు విజయవంతమయ్యారనే చెప్పాలి.

ఇప్పుడు ఏకంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల ఓట్లను తొలగించేశారు. అందులో సహజంగానే వైసీపీ సానుభూతిపరులే అధికం. వైసీపీ సానుభూతిపరులను గుర్తించి మరీ ఓట్లను తొలగించారని జగన్‌ అనుకూల మీడియా కూడా ఘోషిస్తోంది. వైసీపీ నుంచి ఒక్క గుంటూరు జిల్లా నేతలు మాత్రమే ఈ విషయంలో ప్రతిఘటిస్తున్నారు. ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు. ఫైనల్‌గా వచ్చిన ఓట్ల తొలగింపు లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల ఓట్లను కోసేశారు. అందులో కడప జిల్లా నుంచే అత్యధికంగా మూడు లక్షల 20వేల ఓట్లు ఉన్నాయి. అయితే సగటు వైసీపీ సానుభూతిపరులకు వస్తున్న ఒకే ఒక్క ఆందోళనకరమైన అనుమానం ఏమిటంటే.. టీడీపీ వాళ్లు వైసీపీ వాళ్ల ఓట్లు తొలగిస్తున్నారు సరే.. మరి వైసీపీ నేతలు అందుకు విరుగుడుగా ఏమైనా చేస్తున్నారా అన్నది వారి అనుమానం.

కానీ వైసీపీ నుంచి అలాంటి కౌంటర్ యాక్షన్‌ జరుగుతున్నట్టు ఎక్కడా కనిపించదు. వైసీపీలో చురుకైన నేతలతో పాటు జగన్‌ను చూసి జనం ఓట్లేస్తారు కాబట్టి తాము పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు అని తడిగుడ్డ వేసుకుని నిద్రపోతున్న వారి సంఖ్య కూడా చాలా ఉంది. ఓట్ల తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినా ఒక్క గుంటూరులో మాత్రమే వైసీపీ ప్రతిఘటించింది. మిగిలిన జిల్లాల్లోని వైసీపీ నేతలు అదే తరహాలో ఎందుకు పనిచేయడం లేదన్నది ఆ పార్టీ శ్రేణుల ఆందోళన. టీడీపీ నేతలు సమర్ధవంతంగా వైసీపీ సానుభూతిపరులను గుర్తించి మరీ ఓట్లను తొలగించినప్పుడు.. అదే వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా సొంత సానుభూతిపరులను గుర్తించి వారి ఓట్లు ఉన్నాయో లేవో ఎందుకు పరిశీలన చేయలేకపోతున్నారన్నది వారి ప్రశ్న.

ఓటర్లు తమంతట తాముగా ఓటర్ లిస్ట్‌లో పేర్లు క్రాస్‌ చెక్ చేసుకునే పరిస్థితి ఉండదని అభిప్రాయపడుతున్నారు. కేవలం పోలింగ్ రోజు మాత్రం ఓటు ఉందో లేదోచూసుకుని లేకుంటే ఓటేయకుండా మౌనంగా ఉండడం తప్ప ఓటర్లు ఏమీ చేసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఓట్లు తొలగించారని వారి మీద పడి ఏడవడం మాని.. అందుకు విరుగుడుగా వైసీపీ పని చేస్తే బాగుంటుందని ఆ పార్టీ వారే అభిప్రాయపడుతున్నారు. గ్యారెంటీగా వైసీపీకి ఓటేసే వారి ఓటే లేకుండా పోతే.. జగన్ ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. పార్టీ నేతలు ఎంతమంది ఉన్నా ఉపయోగం మాత్రం లేనట్టేనని అభిప్రాయపడుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES