జేసీపై దాడి చేస్తే కూడా దిక్కులేదా? – వైసీపీ అధికార ప్రతినిధి

1591

తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం వద్ద జరిగిన విధ్వంసానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ అధికార ప్రతినిధి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ వైపు వేలు చూపించాలంటేనే భయపడుతుంటారని… అలాంటిది జేసీ దివాకర్ రెడ్డిపైనే ఆశ్రమంలోని వారు రాళ్లు విసిరితే చర్యలు తీసుకోలేని స్థితికి ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు.

గొడవ 48 గంటలుగా జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాంతిని ప్రబోధించాల్సిన బాబా రాళ్లు వేయించే స్థాయికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. జేసీపై రాళ్లు వేసినా కూడా చర్యలు తీసుకోవడం లేదంటే ఇంతకంటే చేతగాని తనం ఏముందని నిలదీశారు.

ఈ బాబాను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో సామాన్యులకు ప్రమాదకరంగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ గతంలో విశాఖకు వస్తే ఎయిర్‌పోర్టులోకి చొరబడి మరీ అరెస్ట్ చేసిన పోలీసులు… ప్రబోధానంద ఆశ్రమంలోని వారు ఏకంగా పోలీసులపైనే దాడులు చేస్తున్నా ఎందుకు వారిని అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బాబాపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES