Telugu Global
WOMEN

మన ఆనందానికి రిలేషన్ షిప్ కి సంబంధం లేదు... నటి టబు

నటి టబు తాను వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవటం వెనుక ఉన్న కారణాలను వివరించింది.

మన ఆనందానికి రిలేషన్ షిప్ కి సంబంధం లేదు... నటి టబు
X

నటి టబు తాను వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవటం వెనుక ఉన్న కారణాలను వివరించింది. ఈ నెల నాలుగున ఆమె తన యాభై రెండవ పుట్టిన రోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా తను ఒంటరిగా ఉండటం గురించి వివరిస్తూ... మన ఆనందానికి మన రిలేషన్ షిప్ కి సంబంధం ఉండదని, ఒంటరిగా ఉండటంలో అంత ఇబ్బంది ఏమీ ఉండదని, కానీ సరైన భాగస్వామి లభించకపోతే ఆ బాధ ఒంటరితనంకంటే చాలా తీవ్రంగా ఉంటుందని టటు చెప్పుకొచ్చింది. స్త్రీపురుషుల మధ్య ఏర్పడే అనుబంధం చాలా సంక్లిష్టంగా ఉంటుందని టబు అభిప్రాయపడింది. ఇంతకుముందు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో టబు ఈ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించింది.

2019లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశంపై మాట్లాడుతూ... ‘యవ్వనంలో ఉన్నపుడు మనలో ప్రేమభావన కలుగుతుంది. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ... అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి. స్వతంత్రంగా వ్యవహరిస్తాం... కొన్ని అంశాలను అధిగమిస్తాం. నేను పనిచేస్తున్నాను... నాకు నేను సొంతంగా ప్రపంచాన్ని చూడాలనుకున్నాను... నేను ఒక మగవాడికోసం నా కెరీర్ ని, ప్రపంచాన్ని చుట్టిరావాలనే నా మనసులోని కోరికని వదిలేస్తే నా శక్తి సామర్ధ్యాలను నేనే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఒకరి జీవితంలో ఒకరు ఉంటూనే ఇద్దరు ఎదగడాన్ని మంచి అనుబంధంగా చెప్పవచ్చు. అనుబంధాలు స్వేచ్ఛగా ఉండాలి... మనల్ని అణచివేసేలా ఉండకూడదు. నా ఆలోచనలు కాస్త భిన్నంగా ఉంటాయని నాకు తెలుసు. రిలేషన్ షిప్ లో ఆడా మగా తేడా ఉంటుందని నేనేప్పుడూ అనుకోలేదు ’ అంటూ తన మనసులోని భావాలను తెలిపింది.

పెళ్లి చేసుకోకపోయినా... తనకంటూ ఓ బిడ్డ ఉంటే బాగుండుననే ఆలోచనలు తనకు ఉండేవని, అయితే అది సరికాదనే ఉద్దేశ్యంతో ఆగిపోయానని ఫిల్మ్ ఫేర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు వెల్లడించింది. తాను వివాహం చేసుకుని బిడ్డను కంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని, అలాకాకుండా మరొకరి బిడ్డని తీసుకుంటే ఆ బిడ్డకు తల్లిదండ్రులను దూరం చేసినట్టవుతుందని ఆమె అభిప్రాయపడింది.

2017లో ముంబయి మిర్రర్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టబు... తన ప్రాణ స్నేహితుడు అజయ్ దేవగన్ కారణంగానే తాను ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది. అజయ్, తను 25ఏళ్లుగా ఒకరికొకరు తెలుసునని, తన కజిన్ సమీర్ ఆర్యకు అజయ్ స్నేహితుడని, తాను వయసురీత్యా పెరుగుతున్నపుడు తమ మధ్య స్నేహ బంధం చాలా బలంగా ఉండేదని టబు తెలిపింది. ఆ టైమ్ లో తనవైపు ఏ కుర్రాడైనా చూసినా తనతో మాట్లాడినా అజయ్, సమీర్ ఊరుకునేవారు కాదని, వాళ్లని కొడతామని బెదిరించేవారని, అందుకే ఇప్పుడు తాను ఒంటరిగా ఉండిపోవడానికి అజయే కారణమవుతాడని టబు హ్యాస్యాన్ని జోడించి పేర్కొంది. టబు ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన కుఫియాలో నటించింది. మరో రెండు సినిమాల్లో ఆమె కనిపించనుంది.

First Published:  12 Nov 2023 7:58 AM GMT
Next Story