4న కృష్ణాజిల్లాలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈనెల 4న‌ కృష్ణాజిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరు గ్రామంలో విష జ్వరాలు సోకి మరణించిన వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. కొంత కాలంగా ఈ గ్రామంలో కలుషిత తాగునీటి కారణంగా మరణాలు సంభవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన కృష్ణా జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ నేతలు, స్థానిక నేతలు కొత్త మాజేరుకు ఇప్పటికే ఒకసారి వెళ్లి స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో వైఎస్ జగన్ ఆ గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ జగన్ ఈనెల 4వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8.50 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కొత్తమాజేరుకు వెళ్లి.. బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ గ్రామంలో మంచినీటి సరఫరా పరిస్థితిపై స్థానిక అధికారులతో జగన్ సమీక్షిస్తారు. అదే రోజు విజయవాడకు చేరుకుని విమానంలో సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. జగన్ పర్యటనలో జిల్లా పార్టీ నేతలు కూడా పాల్గొంటార‌ని పార్టీ కార్య‌క్ర‌మాల క‌మిటీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురామ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here