రోజాకు పీతల సుజాత సవాల్‌!

తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని… నిరూపించకపోతే ఎమ్మేల్యే పదవి నుంచి వైదొలుగుతారా అని వైకాపా ఎమ్మెల్యే రోజాకు సవాలు విసిరారు పీతల సుజాత. గత వారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రోజా వ్యవహరించిన తీరుపై ఆమె అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ నుంచి మాట్లాడారు. అసెంబ్లీలో ఆమె సైగల ద్వారా, మాటల ద్వారా అనేక విధాలుగా దుర్భాషలాడారని, ఇవన్నీ దళిత జాతిని అవమానపరిచేలా ఉన్నాయని ఆమె అన్నారు. నీతి నిజాయితీకి దళితులు మారుపేరని, అంబేద్కర్‌ ఆశయాల మేరకే దళితులు నడుచుకుంటారని ఆమె అన్నారు. తనది ఎవరికీ హాని చేసే తత్వం కాదని, తమ నాయకుడు చంద్రబాబుకు కూడా ఈ విషయం తెలుసునని అన్నారు. పక్కనే ఉన్న వైకాపా అధినేత వై.ఎస్‌. జగన్‌ కూడా రోజాను అదుపు చేయకపోవడం వెనుక కారణం ఏమిటో వారికే తెలియాలని, వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని పీతల సుజాత అన్నారు. అసెంబ్లీలో ఆమె తీరును, మాటలను పునరుద్ఘాటించి మహిళలను తాను అవమాన పరచలేనని, ఆమె ఎటువంటిదో మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న సీడీలు చూస్తే తెలుసుందని సుజాత విమర్శించారు. తాను కష్టపడి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని, అప్పనంగా, అడ్డదారిలో పదవులు పొందే అలవాటు తనకు లేదని ఆమె అన్నారు. దళితులను, మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన రోజాపై చర్యలు తీసుకోవలసిందేనని ఆమె డిమాండు చేశారు. చంద్రబాబు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే దళితుల సత్తా ఏంటో ఆమె చూసేదని పీతల సుజాత అన్నారు.