త్వరలో ‘ఓకే బంగారం’ పాటలు

OK Bangaram
వెండితెరపై అద్బుత దృశ్య కావ్యాలను ఆవిష్కరించిన చ‌రిత్ర మ‌ణిర‌త్నం సొంతం. ఆయన సినిమాలంటే చాలు… ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. మణిరత్నం లేటెస్ట్‌గా ఓకే కన్మణి పేరుతో తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. అదే చిత్రం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి అనిత సమర్పణలో ‘ఓకే బంగారం’ టైటిల్‌తో  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమా  పాటలు త్వరలో విడుదల కానున్నాయి. సంగీత సంచలనం ఏఆర్‌ రెహమాన్ బాణీలు సమకూరుస్తున్న ఈ సినిమా పాటలను ఈ నెలాఖర్లో విడుదల చేసి, చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. డేటింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని తాకేలా అద్బుతంగా ఉంటుందని నిర్మాత దిల్ రాజు అంటున్నారు. చాలా రోజుల తరువాత మణిరత్నం తనదైన శైలిలో రూపొందించిన‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుద‌న‌డం నిస్సందేహం. ఈ సినిమాలో హీరో దుల్కర్‌ సల్మాన్‌కు హీరో నాని డబ్బింగ్‌ చెబుతున్నారు. ఈ విషయంపై నాని మాట్లాడుతూ ‘‘మణిరత్నం గారికి నేను వీరాభిమాని. ఆయన అడగడంతో పాటు దిల్‌ రాజుగారి మీదున్న గౌరవంతో హీరో పాత్రకు డబ్బింగ్‌ చెప్పేందుకు అంగీకరించాను. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ‘సఖి’ కంటే గొప్పగా ఉంటుందనిపించింది. కచ్చితంగా ‘సఖి’ని మించి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది.” అని అన్నారు.