నటుడు రాజేంద్రప్రసాద్‌కి షాక్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల స్థాయిలో పోటాపోటీగా జ‌రుగుతున్నాయి. అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న జ‌య‌సుధ‌కు ప్ర‌స్తుత ‘మా’ అధ్య‌క్షుడు, తెలుగుదేశం ఎంపీ ముర‌ళీమోహ‌న్ మ‌ద్ద‌తిస్తుండ‌గా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు మాజీ ‘మా’ అధ్య‌క్షుడు, మెగా ఫ్యామిలీ మెంబ‌ర్ అయిన నాగ‌బాబు అండ‌గా నిలిచారు. అయితే జయసుధ వైపే సినిమా పరిశ్రమ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు క‌నిపిస్తోంది. ఈ ఎన్నికలలో త‌మ ప్యానల్‌నే గెలిపించాలంటూ జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటాపోటీగా ప్రచారం కూడా చేస్తున్నారు. స‌రిగ్గా ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్‌కి గ‌ట్టి షాక్ తగిలింది. రాజేంద్ర ప్రసాద్ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా శివాజీరాజా, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ పోటీలో నిలిచారు. అయితే బుధవారంనాడు వీరిద్దరూ తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. త‌నకున్న వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లే పోటీ నుంచి విర‌మించుకుంటున్న‌ట్టు ఉత్తేజ్ ప్ర‌క‌టించ‌గా దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు శివాజీరాజా స్పందించ‌లేదు. ఇది రాజేంద్రప్రసాద్‌కి షాక్ లాంటి వార్తే. ముఖ్యంగా ఈ ప్యానెల్ని బ‌ల‌ప‌రుస్తున్న మెగా ఫ్యామిలీకి పిడుగుపాటు వార్త‌.