“మా”లో నేను లేను:శివాజీరాజా

ఇద్దరు పెద్దల కుళ్ళు రాజకీయాలు భరించలేకే “మా” ప్యానల్‌ నుంచి వైదొలగుతున్నట్టు రాజేంద్రప్రసాద్‌ ప్యానల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీలో ఉన్న సినీ నటుడు శివాజీ రాజా ప్రకటించారు. ముఫ్పై యేళ్ళుగా ఎంతో మంచి స్నేహితుడిగా ఉన్న అలీ కూడా తనను మోసం చేశాడని దుయ్యబట్టారు. ఇన్ని రాజకీయాలు చేసినోళ్ళు రాజేంద్రప్రసాద్‌ ప్యానెల్‌లో ఉన్న వారిని గెలిపిస్తారా అని ప్రశ్నించారు. తనకు ఎవరిపైనా ద్వేష భావం లేదని, కొంతమంది అవకాశ వాద రాజకీయాలతో “మా”ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజేంద్రప్రసాద్‌ని పోటీ చేయమని ముందు ముందుకు గెంటినవారే తర్వాత జయసుధను అధ్యక్ష పదవికి పోటీ చేసేట్టు చేశారని, ఏం ఆశించి ఇలా చేశారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలనే సాకులు చెబుతున్న వారికి ముందుగా ఆ విషయం తెలీదా అని ప్రశ్నించారు. తాను ఒకే మాటపై నిలబడతానని, ప్యానెల్‌ నుంచి వైదొలగుతున్నప్పటికీ తన ఓటు రాజేంద్రప్రసాద్‌కే వేస్తానని స్పష్టం చేశారు. -పి.ఆర్‌.