ఇది ధర్మయుద్ధం: “మా” ఎన్నికలపై రాజేంద్రప్రసాద్‌

తన పోటీ చేస్తున్న ప్యానెల్‌ నుంచి ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వైదొలగడం తదితర పరిణామాల నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తన 37 సంవత్సరాల సినీ జీవితంలో 225 సినిమాలు నటించానని, మా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జయసుధ వెనక ఉండి కథ నడిపిస్తున్న కొంతమంది పెద్దవారి నటనను ఇంతకుముందెప్పుడూ తాను చూడలేదని అన్నారు. తాను అధ్యక్షుడిగా పోటీ చేస్తానన్నప్పుడు మోహన్‌బాబు, నాగబాబు వంటి వారు పోటీ చేశారని, తాము ఇంకోసారి తనను సమర్ధిస్తామని చెప్పారని, నాగబాబు ఆ మాట మీద నిలబడ్డారని అన్నారు. సినీ కళాకారుల్లో కొంతమంది పెద్దలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ “మా”ను కంపు కొట్టిస్తున్నారని ఆరోపించారు. తనకు “మా” అధ్యక్షుడిగా పోటీ చేసే స్టేచర్‌ ఉందని, తనతో పోటీ చేయడానికి ఎవరూ సాటి రారని అన్నారు. చాలామంది రియల్‌ ఎస్టేట్‌తోను రకరకాల వ్యాపకాలతోను సంపాదిస్తున్నారని, ఒక్కపైసా కూడా వాళ్ళు పోయేటప్పుడు పట్టుకుపోలేరన్న విషయం గుర్తించాలని అంటూ మురళీమోహన్‌ను ఘాటుగా విమర్శించారు. మంచు లక్ష్మీ, మంచు విష్ణు తనకు మద్దతిస్తానని ముందు చెప్పారని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కాని వెనక్కు తగ్గారని… ఎందుకో తనకు తెలీదని అన్నారు. “మా’ అధ్యక్షుడిగా మోహన్‌బాబు పోటీ చేసినపుడు తాను వైదొలగానని గుర్తు చేశారు. సేవ చేయాలంటే మనస్సు, సంకల్పం ఉంటే చాలని అన్నారు. “ఇది ధర్మ యుద్ధం. రెండు వైపులా నావాళ్ళే ఎవరు గెలిచినా విజయం “మా”దే’ అంటూ వ్యాఖ్యానించారు. తాను గెలిస్తే ఐదు కోట్ల ఖర్చుతో మూడు పనులు చేస్తానని… అందులో ఒకటి పేద కళాకారులకు పింఛన్లు ఏర్పాటు చేయడం, రెండోది కళాకారుల కుటుంబాలకు ఆరోగ్యభీమా చేపట్టడం, మూడోది “మా’ కార్యాలయానికి మంచి ఆఫీసు నిర్మించడం… తనను నమ్మితే గెలిపిస్తారని ఇంతకుమించి చెప్పేది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. – పి.ఆర్‌.