తెలుగు త‌మ్ముళ్ళు డిష్యూం..డిష్యూం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని అనంత‌పురంలో జ‌రిగిన స‌మావేశం ర‌సాభాస‌గా ముగిసింది. పార్టీకి ప్ర‌తి ఒక్క‌రూ పున‌రంకిత‌మ‌వ్వాల‌ని అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర‌చౌద‌రి మాట్లాడుతున్న‌ప్పుడు ఓ కార్య‌క‌ర్త అడ్డుత‌గిలి పార్టీలోని కార్య‌కర్త‌ల‌కు ప్రాధాన్య‌త లేన‌ప్పుడు కార్య‌క్ర‌మాల్లో పున‌రంకితం ఎలా అవుతార‌ని ప్ర‌శ్నించాడు. దీంతో అత‌న్ని బ‌య‌ట‌కు తీసుకుపొమ్మ‌ని ఎమ్మెల్యే ఆదేశించ‌గా కొంద‌రు అత‌న్ని అక్క‌డ నుంచి తీసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేశారు. దీన్ని మేయ‌ర్ వ‌ర్గ స‌భ్యులు అడ్డుకుంటూ ఎదురు తిరిగారు. ఇదే స‌మావేశంలో ఉన్న మంత్రి ప‌ల్లె రఘునాథ‌రెడ్డి శాంతింప జేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఈ ఘ‌ర్ష‌ణ‌ మ‌రింత ముదిరి పిడిగుద్దులు వ‌ర‌కు వెళ్ళింది. ఒక‌ద‌శ‌లో కుర్చీలు విసురుకుంటూ కార్య‌క‌ర్త‌లు స‌మావేశాన్ని ర‌సాభాస‌గా మార్చివేశారు. ఇక గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో స‌భ‌ను అర్ధాంత‌రంగా ముగించి ఎవ‌రికి వారు వెళ్ళిపోయారు. గ‌త కొన్ని రోజులుగా అనంత‌పురంలోని తెలుగుదేశంలో గ్రూపు త‌గాదాలు ర‌గులుకుంటూ పార్టీని రోడ్డుకీడుస్తున్నాయి. అయినా అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈవిష‌యాల‌ను ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.-పిఆర్‌