క‌మ‌నీయం… కోదండ‌రాముని క‌ల్యాణం

క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట‌ ఆల‌యంలో కోదండ‌రామ‌స్వామి క‌ల్యాణోత్స‌వం అత్యంత‌ వైభ‌వోపేతంగా జ‌రిగింది. వాస్త‌వానికి శ్రీ‌రామ న‌వమి రోజు సీతారామ క‌ల్యాణం జ‌ర‌గాల్సి ఉండ‌గా ఇక్క‌డ ఆన‌వాయితీ ప్ర‌కారం కొదండ‌రామ స్వామి, సీత‌మ్మ త‌ల్లికి ఐదో రోజు వివాహం చేస్తారు. ఆ ఆన‌వాయితీని కాద‌న‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అధికార లాంఛనాల‌తో గురువారం రాత్రి చిక్క‌టి వెన్న‌ల‌లో, చ‌క్క‌ని వాతావ‌ర‌ణంలో సీతారామ‌చంద్రుల వివాహం క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. తొలిసారిగా రాష్ట్ర ప్ర‌భుత్వ లాంఛ‌నాలైన ప‌ట్టువ‌స్త్రాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సీతారాముల‌కు అందించారు. ఈ వేడుక‌లో పాల్గొనేందుకు అశేష జ‌నం త‌ర‌లిరావ‌డంతో ఒంటిమిట్ట కిట‌కిట‌లాడింది. ఐదు కిలోమీట‌ర్ల మేర భ‌క్తుల వ్యాపించి ఆ ప్రాంతానికే కొత్త క‌ళ సంత‌రించుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్‌. చంద్ర‌బాబునాయుడుతోపాటు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తులు ఈ క‌ల్యాణోత్స‌వానికి హాజ‌రై త‌మ భ‌క్తిప్ర‌ప‌త్తులు సాటుకున్నారు. క‌ల్యాణోత్స‌వానికి కొన్ని గంట‌ల ముందే క‌డ‌ప‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు ప‌లు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అనంత‌రం ఒంటిమిట్ట‌లో జ‌రిగే బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ ముగిసిన త‌ర్వాత మ‌ళ్ళీ ఆయ‌న కోదండ‌రాముని క‌ల్యాణ వేడుక‌కు హాజ‌రై త‌మ భ‌క్తి భావాన్ని చాటుకున్నారు -పీఆర్‌