మంచు చరియ కూలి పాలమూరు జవాన్లు బలి!

పదవీకాలం ముగిసినా.. దేశభక్తితో మ‌రికొంత కాలం సేవ అందించ‌డానికి సిద్ధ‌ప‌డి సరిహద్దుల్లో విధులు కొన‌సాగిస్తున్న తెలుగు జవాను ఒకరు జమ్మూకాశ్మీర్‌లో హిమశిఖరాలు విరిగిపడి దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కామారం గ్రామానికి చెందిన శివశంకర్‌ (36) పెంటయ్య, నాగమ్మ దంపతుల కుమారుడు. 1996లో ఆర్మీ జవానుగా చేరారు. అప్ప‌టి నుంచి సేవలందించాడు. 2014లో అతడి పదవీకాలం ముగిసింది. అయినా దేశభక్తితో తన పదవీకాలాన్ని పొడిగింపజేసుకుని విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా లడఖ్‌లో మరో నలుగురితో కలిసి వాహనంలో వెళ్తుండగా.. వారి వాహనంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. శివశంకర్‌ సహా నలుగురు జవాన్లు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరొక జవాను క‌నిపించ‌డం లేదు. ఆర్మీ అధికారుల నుంచి శివశంకర్‌ మరణవార్త అందుకున్న అతడి కుటుంబసభ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.