గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్

చత్తిస్ గఢ్ కి చెందిన ఓ ఆదివాసీ వివాహితపై ఖమ్మం జిల్లా బూర్గంపాడు లో సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మంగంపేట సమీపంలోని తోగ్గూడెం గ్రామంలో నివసిస్తున్న వలస ఆదివాసీ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం భద్రాచలం వచ్చింది.  సోలార్ ప్లేట్లు కొనుక్కుని రాత్రి 9 గంటల సమయంలో వారు బస్టాండుకు వస్తున్నారు. ఓ ఆటోవాలా వీరిని మాటల్లో మభ్యపెట్టి వారు వెల్తున్న వైపే తానూ వెళ్తున్నానని నమ్మించాడు. భార్యాభర్తలిద్దరూ ఆ ఆటో ఎక్కారు. భద్రాచలం బస్టాండుకు వచ్చిన తర్వాత మరో ముగ్గురు యువకులు అదే ఆటో ఎక్కారు. సారపాక దాటాక మణుగూరు క్రాస్ రోడ్డు సమీపంలో అటవీప్రాంతంలోకి ఆటోవాలా ఆటో ని తీసుకు వెళ్ళాడు. అదేమని ప్రస్నించిన గిరిజన దంపతులను అటువైపు షార్ట్కట్ దారి ఉందని నమ్మించాడు. అటవీ దారిలో కొద్ది దూరం వెళ్ళాక ఆటో ఆపి ఆటో లోని యువకులంతా భార్యాభర్తలను వారివద్ద ఉన్న సొత్తును ఇవ్వాల్సిందిగా బెదిరించారు. యువకులతో పెనుగులాడి భర్త కొద్దిదూరం పరారయ్యాడు. దాంతో ఆ యువకులు గిరిజన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత భర్త ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. బాధితురాలు, ఆమె భర్త ఆ అటవీ మార్గంలో తెల్లవార్లూ  నడచి చివరకు అశ్వారావుపేట చేరుకున్నారు. సోమవారం బూర్గంపాడు వచ్చి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.