మంత్రగత్తె నెపం తో మహా దారుణం!

Black Magic mad lady
మతి స్థిమితం లేని మహిళ ఆమె. తాను ఎక్కడిదాననో, తన పేరేమిటో, తన వారు ఎవరో చెప్పలేని స్థితి ఆమెది. ఎలా వచ్చిందో ఏమో గానీ నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అక్బర్ నగర్ కు చేరుకున్నది. సమీపంలోని జవహర్ నగర్ కాలనీకి వెళ్ళి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించ సాగింది. పోచమ్మ, హనుమాన్ మందిరాల సమీపంలో ఆమె సంచరిస్తుండడం చూసి గ్రామస్తులు ఆమెను మంత్రగత్తెగా అనుమానించారు. దాంతో జవహర్ నగర్ కాలనీకి చెందిన సుమారు 40 మంది ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలతో ఇష్టారాజ్యంగా కొట్టిపడేశారు. వెల్లకిలా పడుకో బెట్టి కాళ్ళపైనా, చేతులపైనా కొందరు కాళ్ళతో తొక్కిపట్టగా చాతీ పైనా కలితో ఇంకొకరు తొక్కిపట్టారు. మరికొందరు పట్టకారుతో ఆమె పళ్ళన్నిటినీ పీకేశారు. బాధతో విలవిల్లాడినా వారు కనికరించలేదు. చేతులు కాళ్ళపై తొక్కిపట్టడం తో ఎముకలు విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. కర్రలతో ఇష్టారాజ్యంగా కొట్టడంతో అమె స్పృహతప్పి పడిపోయింది. ఆమెపై జరిగిన దాష్టీకం, ఆమెను కొట్టిన దెబ్బలు చూసి వైద్యులే నివ్వెరపోయారు. ఆమె తలకు కూడా బలమైన గాయాలయినట్టు గుర్తించారు. ఆమె బతికే అవకాశాలు తక్కువని హైదరాబాద్ కు తీసుకెళ్ళాలని జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సూచించారు. ఈ పైశాచిక ఘటనకు సంబంధించి పోలీసులు 40 మందిపై కేసు నమోదు చేశారు. ఏడుగురిని రిమాండుకు తరలించారు.