ప్రేమోన్మాది హత్య‌

ఓ యువ‌కుడి ప్రేమ చివ‌ర‌కు త‌న ప్రాణాన్నే తీసింది. రాజు అనే యువ‌కుడు హైద‌రాబాద్‌ కూక‌ట్‌ప‌ల్లిలోని బిడిఎల్ కాల‌నీలో ఉన్న ఓ యువ‌తిని ప్రేమించాడు. అత‌న్ని ప్రేమించ‌డానికి యువ‌తి నిరాక‌రించ‌డంతో రెండు నెల‌ల నుంచి విసిగిపోయిన రాజు ఓ క‌త్తి తీసుకుని  శుక్ర‌వారం తెల్ల‌వారుజామున యువ‌తి ఉన్న ఇంటికి వెళ్ళాడు. ముందుగా అక్క‌డ ఉన్న కుటుంబ‌స‌భ్యుల‌తో వివాదానికి దిగాడు. క‌త్తితో ఇంటికి వ‌చ్చిన అత‌ను యువ‌తి త‌ల్లిని, మ‌రోక‌రిని గాయ‌ప‌రిచాడు. ఆ త‌ర్వాత యువ‌తిపై కూడా క‌త్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్ళి త‌లుపులు మూసి వేశాడు. అదే స‌మ‌యంలో బ‌య‌ట నుంచి వ‌చ్చిన యువ‌తి తండ్రి విష‌యం తెలుసుకుని త‌లుపులు ప‌గుల‌గొట్టి ఇంట్లో ప్ర‌వేశించాడు. అత‌న్ని కూడా గాయ‌ప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో ఎదురు తిరిగిన తండ్రి యువ‌కుడి చేతిలో క‌త్తి లాక్కొని అత‌నిపై ప్ర‌తి దాడి చేశాడు. ఈ దాడిలో యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. ఈ సంఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ యువ‌తి త‌ల్లి మాట్లాడుతూ రెండు నెల‌లుగా త‌న కూతురిని వేధిస్తున్నాడ‌ని, ఉద‌య‌మే క‌త్తితో ఇంటికి వ‌చ్చిన అత‌ను కూతురి కోసం అడిగాడ‌ని, ఇంట్లో లేద‌ని చెప్ప‌డంతో త‌న‌పైన, త‌న కొడుకుపైన దాడి చేశాడ‌ని… ఇంత‌లో త‌న కూతురు రావ‌డంతో ఆమెపై దాడి చేశాడ‌ని చెప్పింది. అప్ప‌డే బ‌య‌టి నుంచి వ‌చ్చి ఇది తెలుసుకున్న త‌న భ‌ర్త యువ‌కుడిని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేశాడ‌ని, ఆయ‌న మీద కూడా దాడికి ప్ర‌య‌త్నించ‌డంతో యువ‌కుడి చేతిలో ఉన్న క‌త్తి లాక్కొని తిరిగి దాడి చేశాడ‌ని  బాధితురాలి త‌ల్లి తెలిపింది. ఆమెకు కూడా త‌ల‌పై బ‌ల‌మైన గాయ‌మ‌వ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. త‌న‌కిచ్చే పెళ్ళి చేస్తామ‌ని చెప్పినా విన‌కుండా త‌మను, త‌మ కూతురిని గాయ‌ప‌రిచాడని ఆమె చెప్పింది.-పీఆర్‌