నక్సలైట్ల పేరుతో దోపిడీ

నక్సలైట్లమంటూ ఓ ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న వాళ్ళని కట్టేసి కత్తులతో బెదిరించి నగదు, బంగారం చోరీ చేసిన ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. స్థానిక అద్దంకి రోడ్డులోని చెన్నారెడ్డి వెంచర్ లో నివాసం ఉంటున్న అల్లం రంగయ్య ఇంటికి ముసుగులు వేసుకుని వచ్చిన దొంగలు ఓ బండరాయితో తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. రంగయ్యను, ఆయన తల్లి, భార్య, కోడల్ని కట్టేశారు. తాము నక్సలైట్లమని అరిస్తే చంపేస్తామని బెదిరించారు. డబ్బులిస్తే ఏమీ చెయ్యమని చెప్పారు. రంగయ్య మెడ మీద కత్తి పెట్టి బీరువా తాళం తీయాలన్నారు. తర్వాత అతని భార్యనూ బెదిరించారు. రంగయ్య భార్య బీరువాలో ఉన్న నగదును, ఒంటి మీద ఉన్న నగలను తీసి ఇచ్చింది.  ఈలోగా రంగయ్య చేతులకు ఉన్న కట్లు విప్పుకుని పెద్దగా కేకలు వేయగా దొంగలు పరారయ్యారు. దోచుకు పోయిన నగలు నగదు విలువ రు.1.5 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.