జేమ్స్ బాండ్ గా కమల్ హాసన్

కథలు, క్యారెక్టర్లతో ప్రయోగాలు చేసే కమల్ హాసన్ ఇప్పుడు మరో కొత్తదనం కోసం పరితపిస్తున్నాడు. ఉత్తమ్ విలన్ సినిమాని పూర్తిచేసిన లోకనాయకుడు త్వరలోనే జేమ్స్ బాండ్ లా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. అవును.. హాలీవుడ్ తరహాలో సాగే జేమ్స్ బాండ్ కథతో కమల్ నెక్ట్స్ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాడు కమల్. మరోవైపు సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కమలే మీడియాకు వెల్లడించాడు. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమాలో బాండ్ గర్ల్ గా త్రిషను ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కమల్ హాసనే సమకూరుస్తున్నాడు. తన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లలో ఎవరో ఒకరికి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో స్టంట్స్, గ్రాఫిక్స్ కోసం ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్లతో చర్చలు జరుపుతున్నాడు కమల్ హాసన్. ప్రీప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వస్తే వచ్చే నెల నుంచి ఈ నయా జేమ్స్ బాండ్ మూవీని సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు కమల్.