తండ్రి బాటలోనే తనయుడు

తెలుగు సినీపరిశ్రమలో ప్రయోగాలకు పెట్టిందిపేరు సూపర్ స్టార్ కృష్ణ. తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశారు కృష్ణ. టాలీవుడ్ కు కొత్తకొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు. కేవలం టెక్నాలజీలకే పరిమితం కాకుండా.. సినిమా కథలు, క్యారెక్టర్ల విషయంలో కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్ సినిమాల్ని పరిచయం చేసిందే కృష్ణ. అలాంటి తండ్రి అడుగుజాడల్లో మహేష్ కూడా నడుస్తున్నాడు. ఎక్కువగా మాస్ మసాలా సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు కృష్ణ తరహాలో ప్రయోగాలు చేయడానికి భయపడట్లేదు మహేష్. వన్-నేనొక్కడినే, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అంతేకాదు.. కెరీర్ స్టార్టింగ్ లో యువరాజు లాంటి సినిమా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు మహేష్. ఆరేళ్ల పిల్లాడికి తండ్రిగా నటించే పాత్రను కెరీర్ స్టార్టింగ్ లో ఏ హీరో చేయడానికి సాహసించడు. కానీ మహేష్ చేశాడు. 
ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక చిత్రాల్ని ఇష్టపడే ప్రిన్స్ ఈసారి కూడా అలాంటిదే మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఆ ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ శ్రీమంతుడు సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తవ్వగానే శ్రీకాంత్ అడ్డాలతో కలిసి బ్రహ్మోత్సవం అనే సినిమాని ప్రారంభిస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాత 14 రీల్స్ తో ప్రయోగాత్మక చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.