బాబుకు బాబాల పిచ్చి ప‌ట్టింది: సీపీఐ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి భూమి పిచ్చి, బాబాల పిచ్చి ప‌ట్టింద‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ విమ‌ర్శించారు. మూడు రోజులపాటు యోగా క్లాసులు తీసుకున్న జ‌గ్గీ వాసుదేవ్ బాబాకు 400 ఎక‌రాల భూమిని ధారాద‌త్తం చేయ‌డం ఎంత‌వర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  మూడు రోజులు యోగా నేర్పినందుకే రూ.600 కోట్ల భూమి ఇచ్చేస్తారా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలోని భూములేమీ చంద్ర‌బాబు జాగీరుకు చెందిన‌వి కావ‌ని, ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌మ పార్టీ చూస్తూ ఊరుకోద‌ని ఆయ‌న అన్నారు. ఈ బాబా గురువుకు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదిస్తున్న భూముల‌ను రామ‌కృష్ణ ప‌రిశీలించారు. బాబాల‌కు, అయిన‌వారికి పందేరాలు చేస్తే స‌హించేది లేద‌ని రామ‌కృష్ణ హెచ్చ‌రించారు. ఇక‌నైనా ఇలాంటి పిచ్చి ప్ర‌తిపాద‌న‌లు విర‌మించుకోవాల‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు.