ఎండకు దొరక్కుండా షూటింగ్

 మొన్నటివరకు అకాల వర్షాలు పడ్డప్పటికీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి వెదర్ లో ఔట్ డోర్ షూటింగ్ అంటే హీరోహీరోయిన్లకు మిట్టమధ్యాహ్నం చుక్కలు కనిపించడం ఖాయం. అందుకే ఇండస్ట్రీ అంతా ఛలో ఫారిన్ అంటోంది. భారీ బడ్జెట్ ఉన్నోళ్లు పారిస్, లండన్ లాంటి లొకేషన్లు ప్లాన్ చేసుకుంటున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలన్నీ థాయ్ లాండ్, మలేషియా, బ్యాంకాక్ వెళ్తున్నాయి. అవి కూడా భరించలేని చిన్న సినిమాలు విశాఖ బీచ్, మదనపల్లి, బెంగళూరు చుట్టూ రౌండ్స్ కొడుతున్నాయి. 
 ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు ఎన్టీఆర్ విదేశాల బాట పట్టబోతున్నాడు. ఇంకొన్ని రోజుల్లో సుకుమార్ తో కలిసి కొత్త సినిమా షూటింగ్ ను లండన్ లో ప్లాన్ చేశాడు యంగ్ టైగర్. ఫైట్స్, సాంగ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు అక్కడే కానిచ్చేయాలని చూస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయిన రామ్ చరణ్ కూడా దర్శకుడు శ్రీనువైట్ల తో కలిసి విదేశీయానానికి సిద్ధమౌతున్నాడు. తన కొత్త సినిమా మై నేమ్ ఈజ్ రాజు షూటింగ్ కు సంబంధించి విదేశాల్లో పాటలు చిత్రీకరించాలనుకుంటున్నారు. మరోవైపు మహేష్ కూడా శ్రీమంతుడు నెక్ట్స్ షెడ్యూల్ ను పారిస్ లో ప్లాన్ చేస్తున్నాడు. రవితేజ, అఖిల్, సాయిధర్మతేజ, గోపీచంద్ లాంటి హీరోలు కూడా త్వరలోనే విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తమ్మీద టాలీవుడ్ హీరోలంతా ఈ సమ్మర్ ను కూల్ గా గడిపేయడానికి బాగానే స్కెచ్ వేసుకున్నారు.