అల్లరోడి మరో కామెడీ ప్రయోగం

ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా.. కూల్ క్యారెక్టర్స్ తో.. సాధారణమైన పాత్రలతో హాస్యం పండించినప్పుడు అద్భుతమైన విజయాలు అందుకున్నాడు అల్లరోడు. కానీ కామెడీ కొత్తపుంతలు తొక్కినప్పుడు.. క్రియేటివిటీ పీక్స్ కు వెళ్లిపోయినప్పుడు మాత్రం బొక్కబోల్తాపడ్డాడు. తన సినిమాల విషయంలో అల్లరినరేష్ ఎందుకో ఈ తేడాని గమనించలేకపోతున్నాడు. యాక్షన్ త్రీడీ, బ్రదర్ ఆఫ్ బొమ్మళి, లడ్డూబాబు లాంటి కామెడీ ప్రయోగాలతో చేతులుకాల్చుకున్న అల్లరినరేష్, ఇప్పుడు మరో అల్లరి ప్రయోగానికి సిద్ధమయ్యాడు. అదే జేమ్స్ బాండ్. నేను కాదు.. నా పెళ్లాం అనేది దీనికి ఉపశీర్షిక. చూస్తుంటే.. ఈ సినిమా కూడా బ్రదర్ ఆఫ్ బొమ్మాళి ఛాయల్లోనే కొనసాగేలా ఉంది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి లో రెబల్ గా ఉంటే సిస్టర్ కి బ్రదర్ గా నటించాడు. జేమ్స్ బాండ్ లో ఎగ్రెసివ్ గా ఉండే భార్యకు భర్తగా నటిస్తున్నాడు అంతేకాదు.. సినిమా కథాంశం కామన్ గా కనిపిస్తున్నప్పటికీ.. ట్రీట్ మెంట్ లో కాస్త కామెడీ దట్టిస్తే సినిమా ఒడ్డునపడుతుంది. సాయికిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందంటున్నాడు అల్లరినరేష్. బందిపోటు తర్వాత కాస్త విరామం తీసుకొని చేసిన ఈ సినిమా అయినా అల్లరి నరేష్ కు హిట్టివ్వాలని ఆశిద్దాం. అన్నట్టు ఈ సినిమా ప్రచారం కోసం మరోసారి తన ట్విట్టర్ ఖాతాను ఆధారంగా చేసుకున్నాడు నరేష్.