పెట్రో ధరలు మరింత పైకి?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంకా పెరుగుతాయా? నెల రోజుల క్రితమే లీటర్‌ పెట్రోల్‌ ధరను 1.30 రూపాయల మేర తగ్గించిన చమురు కంపెనీలు హఠాత్తుగా లీటర్‌కు 4 రూపాయలు పెంచడమేమిటీ? లీటర్‌ పెట్రోల్‌ ధర 55-60 రూపాయల మధ్యకు దిగివస్తుందన్న అంచనాలన్నీ ఉట్టుట్టి మాట‌లేనా? రేట్లు పూర్తిగా తగ్గకుండా అదనంగా పన్నులు వేసిన ప్రభుత్వ, పన్నులను కొనసాగిస్తుందా, లేక తగ్గిస్తుందా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ, గురువారం చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయం వినియోగదారుల‌ లోకాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. కొన్ని నెలలుగా డీజిల్‌, పెట్రోల్‌ ధరల విషయంలో నిశ్చింతగా ఉన్న వినియోగదారులు తాజా పెంపుదలతో అందోళ‌న‌కి గుర‌వుతున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గిపోతున్న స‌మ‌యంలో కూడా పెట్రో ధ‌ర‌ల‌ను పెంచ‌డం సామాన్యుడు జీర్ణించుకోలేక పోతున్నాడు.
ఒక‌సారి ధ‌ర‌లు పెరిగితే దాన్ని సాకుగా చూపి దామాషా ప‌ద్ధ‌తిలో పన్నులు పెంచేస్తున్నాయి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. స‌గ‌టు మ‌నిషి న‌డ్డి విర‌గ కుండా చూడ‌డం ప్ర‌భుత్వాల క‌నీస బాధ్య‌త‌. కాని… జ‌నం ఎలా చ‌స్తే మాకేంటి అన్న ధోర‌ణిలో ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. నిజానికి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రూ. 50 వ‌ర‌కు వ‌స్తాయ‌న్న‌ది స‌గ‌టు మ‌నిషి ఆశ. కాని రూ. 67 వ‌ర‌కు వ‌చ్చిన పెట్రోల్ ధ‌ర ఒక్క‌సారిగా మ‌ళ్ళీ రూ. 71 దాటింటి. ఇక డీజిల్ కూడా 56 దాటింది. ఇలా పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా ఉంటే బీజేపీ ప్ర‌భుత్వం మీద ఉన్న ఆశ‌లు కూడా అడియాశ‌లైపోతాయి. ఇక ప్ర‌జ‌లకు ఉద్య‌మబాట ఒక‌టే శ‌ర‌ణ్య‌మ‌వుతుంది. ఇప్ప‌టికే పెరిగిన ధ‌ర‌ల‌పై వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ పార్టీలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. వీరికి వినియోగ‌దారులు తోడైతే ప్ర‌భుత్వ ప‌రువు రోడ్డెక్క‌టం ఖాయం.