హీరో స‌ల్మాన్‌ఖాన్ కు ఇక జైలేనా?

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న‌ హిట్ అండ్‌ ర‌న్ కేసులో నేడు తీర్పు వెలువ‌డ‌నుంది. 13 ఏళ్ల సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం వెలువ‌డుతున్న తీర్పు కావ‌డంతో ప్ర‌జ‌లు, అభిమానులు, బాలీవుడ్ ప్ర‌ముఖులలో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ తీర్పును బుధవారం ఉదయం 11.15 గంటలకు ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే వెలువరించనున్నారు. దీంతో కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ కేసు సినీఫ‌క్కీలో అనేక మ‌లుపులు తిరిగింది. పోలీసులు విచార‌ణ ప‌త్రాలు మాయం అయ్యాయ‌ని కోర్టుకు నివేదించారు. కోర్టు మొట్టికాయ‌లతో మ‌ళ్లీ దొరికాయ‌ని చెప్పారు. మొత్తానికి నేరం రుజువైతే స‌ల్మాన్‌కు ప‌దేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న మీద రూ.200 కోట్ల ప్రాజెక్టులు ఆధార‌ప‌డి ఉన్నాయి. శిక్ష ప‌డితే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని నిర్మాతలు తీవ్ర అందోళ‌న‌లో ఉన్నారు. మొద‌టి నుంచి స‌ల్మాన్ కు బాలీవుడ్‌లో బ్యాడ్‌బాయ్‌గానే పేరుంది. హ‌మ్‌సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ స‌మ‌యంలో రాజ‌స్థాన్‌లో కృష్ణ జింక‌ల‌ కాల్చివేత‌ కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసు కూడా విచార‌ణ‌లో ఉంది.