బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలపై ‘ఉగ్ర’ గురి

న్యూఢిల్లీ : బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు.. పోలీసులే లక్ష్యంగా సాగుతున్న ‘ఉగ్ర’ కుట్రను నిఘా సంస్థ‌లు భ‌గ్నం చేశాయి. ఈ కుట్రల వెనుక సూత్రధారి యూసఫ్‌ అల్‌ హిండీ అనే ఉగ్రవాది కాగా.. మధ్యప్రదేశ్‌ రత్లాం ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌, వసీమ్‌, రిజ్వాన్‌, అన్వర్‌ ఖురేషీ అనే నలుగురు యువకులూ పాత్రధారులు. కొన్నాళ్లుగా వీరు నలుగురూ యూసుఫ్‌తో ఆన్‌లైన్‌ చాటింగ్ చేస్తూ అతడి సలహా మేరకు రెండు తుపాకులు కూడా సంపాదించారు. స్థానికంగా దొరికే పేలుడు పదార్థాలతో ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజెస్‌ (ఐఈడీలు) తయారు చేయడమూ నేర్చుకుంటున్నారు. వీరి ఆన్‌లైన్‌ చాటింగ్‌పై నిఘా వేసిన కేంద్ర భద్రతా సంస్థలు, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌, మధ్యప్రదేశ్‌ పోలీసులు వారిని అరెస్టు చేయడం ద్వారా ఈ కుట్రను భగ్నం చేయగలిగారు. యూసఫ్‌ తొలుత అఫ్గాన్‌ నుంచి తన ఉగ్ర కార్యకలాపాలు నడిపేవాడని ఇటీవలే తన కార్యస్థానాన్ని సిరియాకు మార్చాడని.. భారత్‌లో ఐఎస్‌ తరఫున ఉగ్ర చర్యలకు రూపకల్పన చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. ఇటీవలే అతడు మరణించాడని, సోదరుడు షఫీనే యూసఫ్‌ పేరుతో అతడి ఈమెయిల్‌ ఖాతాలను నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. కాగా ఇస్లామిక్‌ సామ్రాజ్య స్థాపన పేరుతో దేశదేశాల నుంచి యువకులను ఆకర్షిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రభావం ఇప్పటి వరకూ భారత్‌లో పెద్దగా లేదనే భావించారు. అక్కడక్కడా ఒకటీ అరా సానుభూతిపరులు, ఆన్‌లైన్‌ సమాచారకర్తలు మినహా.. ఆ సంస్థ శాఖలు, విధ్వంసక కార్యక్రమాలు భారత్‌లో కష్టసాధ్యమని అనుకున్నారు. అయితే.. ఇదంతా తప్పని తేలిపోయింది. బహిరంగ ప్రచారం లేకుండా.. చాప కింద నీరులా చొచ్చుకొచ్చిన ఐఎస్‌.. ఏకంగా తమ కోసం రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీనే ఏర్పాటు చేసిందంటే ప‌రిస్థితి ఎంత వేళ్ళూనిందో అర్ధం చేసుకోవ‌చ్చు.
కాగా ఐఎస్‌ కీలక నేతలు నలుగురి తలలకు అమెరికా భారీ నజరానా ప్రకటించింది. వారి ఆచూకీ తెలిపిన వారికి రూ.127 కోట్లు బహుమానంగా ఇస్తామని పేర్కొంది. అబ్దుల్‌ రహ్మాన్‌ ముస్తఫా అల్‌ ఖాదులి, అబు మహ్మద్‌ అల్‌ అద్నానీ, తర్ఖాన్‌ తయుమురజోవిక్‌ బతిర్షావలీ, తారిక్‌ బిన్‌ అల్‌ తహర్‌ బిన్‌ అల్‌ ఫలీ అల్‌ అవ్నీ హర్జి తలలకు ఈ రివార్డును ప్రకటించింది.