నేడు ‘జన్‌సురక్ష’కు బెంగాల్‌తో శ్రీ‌కారం

ప్రధాని నరేంద్రమోదీ జన్‌సురక్ష పేరిట అసంఘ‌టిత కార్మికుల సంక్షేమం కోసం మూడు సామాజిక భద్రత పథకాలను శ‌నివారం   ప్రారంభించనున్నారు. త్వ‌ర‌లో ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ప‌థ‌కాల‌కు కోల్‌క‌తాలోనే శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఎలాగైనా ఈసారి మ‌మ‌త కోట‌లో పాగా వేయాల‌న్న‌ది బీజేపీ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అసంఘటిత రంగ కార్మికులు, పేదల సంక్షేమం లక్ష్యంగా ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పేరిట వీటిని ప్రవేశపెడుతున్నారు. కోల్‌కతాలో ప్రధాని ప్రారంభించే సమయంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 115 కేంద్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు కూడా ఈ పథకాలను ప్రారంభిస్తారు.