దావూద్ ఎక్క‌డున్నాడో భార‌త్‌కు తెలియ‌దా?

ముంబై మాఫియా డాన్‌, 1993 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఎక్క‌డున్నాడో నిజంగానే భార‌త్‌కు తెలియ‌దా? పార్ల‌మెంటుకు ఇదే విష‌యాన్ని కేంద్ర హోంశాఖ ఇటీవ‌ల పార్ల‌మెంటుకు తెలిపింది. నిజానికి దావూద్ పాకిస్థాన్‌లో ఉన్నాడ‌న్న సంగ‌తి ఇండియాలో చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతాడు. 1993 బాంబు పేలుళ్ల అనంత‌రం దుబాయ్ పారిపోయిన దావూద్ అక్క‌డ నుంచే త‌న నేర సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు. ఈశాన్య ఆసియాలో అత్యంత క్రూర‌మైన నెట్‌వ‌ర్క్‌గా డీ-గ్యాంగ్ మారింది. ఇండియాలో కోటీశ్వ‌రుల నుంచి వ‌సూలు చేసిన డ‌బ్బును హ‌వాలా రూపంలో దేశం దాటించి దుబాయ్‌, పాకిస్తాన్‌లో అనేక వ్యాపారాలు ప్రారంభించాడు. హ‌వాలా, క్రికెట్ బెట్టింగ్‌, హ‌త్య‌లు, బెదిరింపుల‌తో భార‌త్‌కు త‌ల‌నొప్పిగా మారాడు. దుబాయ్‌తో భార‌త్ నేరగాళ్ల అప్ప‌గింత ఒప్పందం చేసుకుంటుంద‌ని భ‌య‌ప‌డిన‌ దావూద్ త‌మ మ‌కాంను పాకిస్తాన్‌కు మార్చాడు. అక్క‌డ దావూద్ త‌న కూతురును ప్ర‌ముఖ క్రికెట‌ర్ జావెద్ మియాందాద్ కుమారుడికి ఇచ్చి వివాహం చేసిన సంగ‌తి మీడియా ద్వారా లోక‌మంతా చూసింది. కానీ, ఈ విష‌యం ఎన్డీఏ ప్ర‌భుత్వానికి తెలియ‌ద‌నడం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. పాకిస్తాన్‌లో అత‌నికి సాక్షాత్తూ ఆ దేశ గుఢాచార సంస్థ ఐఎస్ ఐ ర‌క్ష‌ణతో కూడిన ఆశ్ర‌యం క‌ల్పిస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని భార‌త్‌లో ప‌లు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన  అబ్దుల్ కరీం తుండా వెల్ల‌డించాడ‌ని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్ల‌డించిన సంగ‌తిని ఎవ‌రూ మ‌ర‌వ‌లేద‌న్న సంగ‌తి కేంద్ర హోంశాఖ ఎందుకు విస్మ‌రించిందో! దావూద్ ను అప్ప‌గించాల‌ని గ‌తంలో భార‌త్ చేసిన ప్ర‌య‌త్నాల‌ను పాక్ ప‌ట్టించుకోలేదు. భార‌త్‌లో ఐఎస్ ఐ సృష్టించే విధ్వంసాల‌కు దావూద్ అనుచ‌రుల‌ను వాడుకుంటోంద‌న్న సంగ‌తీ ప్ర‌భుత్వాల‌కు తెలియ‌నిది కాదు. అలాంటి దావూద్ ఎక్క‌డున్నాడో తెలియ‌ద‌ని ప్ర‌క‌టించ‌డం 1993 ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.