బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డాడు: హ‌రీశ్‌

‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే నవ్వొస్తుంది.. జాలేస్తుంది. తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. ఇది నగ్న సత్యం.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఎన్జీవో భవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారాన్ని చంద్రబాబు మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు.. తెలంగాణ ప్రభుత్వంపై గొంతు చించుకొని అరిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొని, అడ్డగోలుగా కుట్రలు చేశాడు, ఆవిర్భావం అనంతరం విద్యుత్ సమస్యను సృష్టించేందుకు కుట్ర పన్నాడు. అలాంటి కుట్రల బాబు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హరీశ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను రేవంత్‌రెడ్డి ద్వారా తన వైపు తిప్పుకునేందుకు చేసిన కుట్రలో చంద్రబాబు పాత్ర యావత్ ప్రపంచానికి తెలిపి పోయింద‌న్నారు. రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని మరల్చేందుకు బాబు ప్రయత్నిం చడం సరికాదన్నారు. రేవంత్ ఉదంతం తెలంగాణ ప్రభుత్వ కుట్రగా అభివర్ణిస్తూ గగ్గోలు పెట్టడం.. దొంగే దొంగ దొంగ.. అని అరిచినట్టుగా ఉందన్నారు. నైతికత ఉంటే చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని హరీశ్ అన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు కుట్రలను మరిచిపోలేదని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్నారు.