బాబుపై కేసు న‌మోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్?

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంలో దూకుడు పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో చంద్రబాబుకు ఏ క్షణమైనా నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటోది. అదీకాక చంద్రబాబు ఢిల్లీ పయనంపై కూడా వారు ఈ సందర్భంగా వారు చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్‌ కేసు దర్యాప్తు పురోగతిని ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఎంకు వివరించినట్లు తెలిసింది. నోటుకు ఓటు వ్యవహారంలో ఆడియో టేపులు వెలువడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా తన నివాసం వద్ద భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చి వేశారు. కొత్తవారిని నియమించారు. ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షణను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. అలాగే గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా సమూల మార్పులు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన భద్రత మార్పులతో స‌హా ప‌లు విష‌యాల‌ను ఏకే ఖాన్ కేసీఆర్‌కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.