భూతోచ్ఛాటన అడ్వాణీకి సాధ్యమా?

సరిగ్గా వారం రోజులు గడిస్తే దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 40 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్ వ్యూలో బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అడ్వాణీకి మళ్లీ ఎమర్జెన్సీ విధించే అవకాశం లేక పోలేదన్న అనుమానం వెలిబుచ్చారు. ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన సహజంగానే వ్యక్తుల పేర్లు గానీ, ప్రస్తుత ప్రభుత్వం పేరు గానీ ఎత్తలేదు. అయినా అడ్వాణీ ఆంతర్యం ఏమిటో కనిపెట్టడం బ్రహ్మ విద్యేమీ కాదు. నరేంద్ర మోదీ ఏడాది పాలనలో అనుకూల అంశాలు ఉండొచ్చు కాని అధికార కేంద్రీకరణ స్పష్టంగానే కనిపిస్తోంది. మోదీని ప్రస్తుతించడానికి తప్ప మంత్రులు నోరే మెదపడం లేదు.

ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితికి అడ్వాణీ కూడా బాధితుడే. ఆయన 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అడ్వాణీకున్న రాజకీయ అనుభవం అరవై ఏళ్ల పైనే. అందువల్ల ఆయన వ్యక్తం చేసిన భయాందోళనలను తేలికగా కొట్టి పారేయడానికి వీల్లేదు. భయంకరమైన ఎమర్జెన్సీ అనుభవం తర్వాత కూడా ఆ పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా జరిగిన కట్టుదిట్టాలు పెద్దగా లేవన్నది ఆయన అభిప్రాయం. “మళ్లీ పౌర హక్కులను నిలిపి వేయరనీ, వాటిని నాశనం చేయరని అనుకోవడం లేదు” అని అడ్వాణీ స్పష్టంగానే చెప్పారు. “మన రాజకీయ వ్యవస్థలో గానీ, రాజకీయ నాయకత్వంలో గానీ మళ్లీ ఎమర్జెన్సీ విధించబోరన్న నమ్మకం కుదరడం లేదు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత, ప్రజాస్వామ్యానికి సకల అంశాలలోనూ కొరతే ఉంది” అని అడ్వాణీ ఆందోళన వ్యక్తం చేశారు.

“ప్రస్తుతం రాజకీయ నాయకత్వం పరిణతి చెందలేదని అనను గాని, మళ్లీ ఎమర్జెన్సీ విధించరన్న నమ్మకం కుదరడం లేదు” అని అడ్వాణీ నిర్మొహమాటంగానే చెప్పారు.

ఎమర్జెన్సీ విధించకుండా ఉండడానికి ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని కట్టుదిట్టాలు పెరిగి ఉండొచ్చు. ఎమర్జెన్సీ విధించడం ఇందిరా గాంధీ హయాంలో లాగా సులభం కాకపోవచ్చు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడూ కట్టు దిట్టాలు లేక కాదు. కాని నిరంకుశాధికారం చెలాయించే వారికి ఈ కట్టు దిట్టాలు వర్తించవు. ఇప్పుడూ అదే పరిస్థితి తలెత్తదని చెప్పే ధైర్యం మాత్రం తనకు లేదన్నదే అడ్వాణీ బాధ. 2015లో కూడా ఎమర్జెన్సీ విధించకుండా ఉండకుండా ఉండడానికి ఉండాల్సినన్ని కట్టు దిట్టాలు లేవన్నదే అడ్వాణీ అభిప్రాయం.

మునుపటికన్నా మీడియా మరింత స్వేచ్ఛగా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం విషయంలో, పౌర హక్కుల విషయంలో మీడియా ఏ మేరకు నిబద్ధమై ఉందన్న అంశంపై అడ్వాణీకి అనుమానాలున్నాయి. ఎమర్జెన్సీ విధించక ముందూ మన దేశంలో పత్రికా స్వేచ్ఛకు కొరతేమీ లేదు. కాని ఒక్క సారి ఎమర్జెన్సీ విధిస్తే పత్రికా స్వేచ్ఛకు కత్తెర పడుతుంది. ఆ పరిస్థితిని ఎదుర్కునే శక్తి పత్రికలు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ అమలు చేసినప్పుడు ప్రదర్శించలేదు. అడ్వాణీ మాటల్లోనే చెప్పాలంటే అప్పుడు “మీడియా కాస్త లొంగి ఉండమంటే సాగిల పడింది.” మీడియా విషయంలో ఒక్కటే మార్పు. అప్పుడు టివీ ఛనళ్లు తక్కువ. ప్రైవేట్ ఛనళ్లు లేనే లేవు. ఇప్పుడు ప్రైవేటు టివీ ఛానళ్లు తామర తంపరగా ఉన్నప్పటికి ప్రజస్వామ్య విలువలను, పౌర హక్కులను పరిరక్షించడానికి దృఢంగా నిలబడగలవనే నమ్మకం మీడియా రంగంతో పాటు ఎవరికీ లేదు. ఈ తరానికి ప్రజాస్వామ్యం, పౌర హక్కుల మీద అంత పట్టింపు లేదని కూడా అడ్వాణీ అన్నారు. ఆ మాట వాస్తవం కాదని గుండె నిబ్బరంతో చెప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

దిల్లీ యూనివర్సిటీ రాం లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పని చేస్తున్న ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబాను నిర్బంధించింది ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కాక పోవచ్చు. కాని 90 శాతం వికలాంగుడైన సాయిబాబాను నిర్బంధించింది మాత్రం ఆయన ప్రజల ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడినందువల్లే. ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య హక్కుల మీద విశ్వాసమే ఉన్నట్టయితే గతంలో జరిగిన తప్పును సరిదిద్ది ఉండొచ్చు. కాని ఆ ఛాయలే లేవు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కొత్త ప్రభుత్వ ధోరణిలో గుణాత్మకమైన మార్పేమీ లేదు. భిన్నాభిప్రాయాన్ని సహించే లక్షణం తమకు ఉందని నిరూపించడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య కూడా లేదు. కాని అధికారం అంతా ప్రధాన మాంత్రి కార్యాలయంలో కేంద్రీకృతం కావడానికి సకల కట్టుదిట్టాలూ చేశారు. ఈ విషయంలో మోదీకి ఇందిరా గాంధీయే ఆదర్శంగా ఉన్నట్టున్నారు. వికృత రూపం దాల్చక పోవచ్చు కాని ప్రస్తుత ఏలుబడిలో ఫాసిస్టు ధోరణులు పొడసూపుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రులందరి పరిస్థితి నిగమ శర్మ అక్కల్లాగే ఉంది. ఏ విధాన ప్రకటన అయినా ప్రధాన మంత్రి నోట రావాల్సిందే.

ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండే లక్షణం మన రాజకీయ వ్యస్థలో దాదాపు మృగ్యం. పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కుళ్లు కంపు కొడుతున్న రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడుతుందని ఆశించడం వృధా. రాజకీయ వ్యవస్థ చరిత్ర నుంచి మన రాజకియ పార్టీలు నేర్చుకున్న గుణపాఠాలు పూజ్యం. ప్రధాన మంత్రి సమర్థుడే కావచ్చు. ఆ సామర్థ్యం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపడడంలో ఎక్కడా కనిపించడం లేదు. అధికార కేంద్రీకరణకు, ప్రధాని పలుకుబడిని ఇనుమడింప చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఆవ గింజంతైనా ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణలో కనిపించడం లేదు. ఆ ధోరణే ఉంటే అరుణ్ జైట్లీ లాంటి నాయకుడు ప్రజలెన్నుకున్న లోక సభ నిర్ణయాన్ని తప్పు పట్టే అధికారం రాజ్య సభకు ఎక్కడిది అని ప్రశ్నించరు.

అడ్వాణీ వ్యాఖ్యలు సహజంగానే దుమారానికి తెర తీశాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మోదీని ఆ స్థానంలో ప్రతిష్ఠించిన ఆర్ ఎస్ ఎస్ అడ్వాణీ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించినవి కాదని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అడ్వాణీ మార్గదర్శక మండలి సభ్యుడు గనక కావలంటే ఆయన మోదీతో నేరుగా మాట్లాడగలరని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మార్గదర్శక మండలికి మోదీ ఏ పాటి విలువ ఇస్తున్నారో ఎవరికి తెలియదు కనక. అడ్వాణీ వెలిబుచ్చిన అభిప్రాయాలు వ్యక్తులను ఉద్దేశించి కాదనీ వ్యవస్థలను ఉద్దేశించేనని సీనియర్ పత్రికా రచయిత, బీజేపీ అధికార ప్రతినిధి అయిన ఎం జె అక్బర్ భాషయకారుడి పాత్ర పోషిస్తున్నారు.

అడ్వాణీ శిశ్యరికం చేసే మోదీ ఇంతటి వాడయ్యారు. గుజరాత్ అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మోదీ రాజ ధర్మం పాటించాలని సుతి మెత్తగా చెప్పిన మాటలను మోదీ పట్టించుకోక పోవడానికి ఆ రోజుల్లో మోదీకి అడ్వాణీ మద్దతు ఉండడమే కారణం. అయితే ఇప్పుడు మోదీ తిరుగు లేని నాయకుడు. ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించే అలవాటు ఉన్న మనిషి కారు. ఆయన ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగించడానికే ఇష్ట పడతారు. తన దారికి అడ్డు తగులుతారనుకున్న వారిని మార్గదర్శక మండలికి పరిమితం చేయగల సమర్థుడు. అడ్వాణీకి లోలోపల ఈ బాధా ఉండొచ్చు. కాని మోదీని ఇంతటి వాడిని చేసింది ఆయనే. ఇప్పుడు భూతోచ్ఛాటన సాధ్యమయ్యే పనేనా!

– ఆర్వీ రామారావ్