నీకు సగం – నాకు సగం (Devotional)

ఒక ఆరితేరిన దొంగ ఉండేవాడు. దొంగతనాన్ని మనవాళ్ళు అరవైనాలుగు కళల్లో ఒకటిగా చేర్చారు. ఆ కళలో అతను ఆరితేరినవాడు. సునాయాసంగా పెద్దపెద్ద దొంగతనాలు చేసేవాడు. అతనికి దయాదాక్షిణ్యాలుండేవి కావు. కఠినంగా తయారయ్యాడు. అతనికి ఎంతసేపూ చీకటితోనే పని. దోచుకోవడమే తెలిసిన వాడికి మానవత్వంతో పని ఉండదు.

            ఒకరోజు ఆ దొంగ దొంగతనానికి బయల్దేరాడు. దారిలోఒక స్వాముల వారు జనాలకి ఏవో ఉపదేశాలివ్వడం చూశాడు. ఏం చెబుతున్నాడో విందామని ఆసక్తి కలిగింది. జనాలలోకి దూరి కూచుని స్వాములవారు చెప్పేమాటల్ని విన్నాడు.

            ఆ స్వాములవారు లోకంలోని దుర్గుణాల్ని విమర్శిస్తూ దొంగతనమన్నది ఎంత తప్పో చెబుతున్నాడు. ఇతరులు ఎంతో కష్టపడి దాచుకున్నవి దోచుకునే దొంగ నరకంలో చిత్రహింసల పాలవుతాడని, అతనికి నిష్కృతి ఉండదని, అట్లాంటి పాపకార్యాల్ని వదిలి పనిచేసుకుని జీవించడం మేలని, లేకుంటే బిచ్చమెత్తుకున్నా ఎవరో ఒకరు అంత అన్నం పెట్టకపోరని అన్నాడు.

            ఆ మాటలు దొంగమీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. నిజమే కదా! జానెడు పొట్టకోసం. నాలుగు మెతుకుల కోసం ఇంత నీచకార్యానికి నేను ఒడిగడుతున్నాను. ఈ దొంగతనం వదిలి కాయకష్టం చేసుకుని బతుకుతాను అని నిర్ణయించుకున్నాడు.

            స్వామి మాటలు విన్నంతసేపు పని చేశాయి. అక్కడినించీ వెళ్ళాక స్వామి చెప్పినమాటలు నిజమే కానీ నా దగ్గర ఎక్కువ డబ్బువుంటే మళ్ళీ దొంగతనం చెయ్యాల్సిన పనివుండదు కదా! ఈ సారి రాజు గారి ఖజానాని దోచుకుని తరువాత దొంగతనం మానేస్తాను అని నిశ్చయించాడు. వెంటనే ఒక జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళి “అయ్యా! నేను రాజుగారి ఖజానాని దొంగిలించాలనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ముట్టచెబుతాను. మంచి ముహూర్తం పెట్టండి” అన్నాడు. జ్యోతిష్కుడికి ఒళ్ళుమండింది. “నేను శుభకార్యాలకు ముహూర్తం నిర్ణయించేవాణ్ణి, ఇట్లాంటి తప్పుడుపనులకు కక్కుర్తి పడేరకాన్నికాదు వెళ్ళు” అన్నాడు. దొంగ జ్యోతిష్కుడి చెవిలో ఏదో చెప్పాడు. జ్యోతిష్కుడి మొఖం వెలిగింది. వెంటనే పంచాంగంతీసి వేళ్ళు లెక్కపెట్టి అమావాస్య అర్ధరాత్రి, పన్నెండుగంటల పదినిముషాలకు దివ్యలగ్నం ఉంది. నీకు తిరుగు ఉండదు, వెళ్ళు అన్నాడు.

            అమావాస్య వచ్చింది. ముహూర్తం వచ్చింది. దొంగ సరంజామాతో సిద్ధమై రాజు భవనానికి వెళ్ళాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నిరాటంకంగా ఖజానాలోకి ప్రవేశించి బంగారం, వజ్రాలు, రత్నాలు మూట కట్టాడు. అంత సంపదను ఒక్కసారిగా చూడడంతో అతని కళ్ళు బైర్లు కమ్మాయి. మోయలేనంత బరువును మోసుకుంటూ అడుగుతీసి అడుగు వేశాడు. నెత్తిన ఉన్న మూట ఒక్కసారిగా కిందపడి అన్నీ చెల్లా చెదురై పెద్ద శబ్దం వచ్చింది. దాంతో సైనికులు లేచి దొంగను బంధించి రాజు దగ్గరకు తీసుకెళ్ళారు.

            రాజు దొంగకు మండుటెండలో వంద కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. మరుసటిరోజు ఎండలో దొంగవీపు చిట్లేలా సైనికులు కొరడాతో కొట్టారు. బాధ భరించలేక “ఆగండి” అని అరిచాడు. “ఏమైంది?” అన్నారు.

            ఈ దొంగతనంలో జ్యోతిష్కుడికీ భాగముంది. నేను సంపాదించిన దాంట్లో అతనికి సగమిస్తానన్నాను. దొంగతనానికి ముహూర్తం పెట్టింది అతనే అన్నాడు.

            జ్యోతిష్కుణ్ణి పట్టుకొచ్చి తక్కిన యాభై కొరడాదెబ్బల్తో అతన్ని సత్కరించారు.

            తప్పుడు పనికి సహకరిస్తే సగానికి సగం ఫలితమనుభవించక తప్పదు.

– సౌభాగ్య