బాబు, కేసీఆర్ సెక్ష‌న్ 8 నాట‌కాలాడుతున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సెక్షన్‌ 8  పేరుతో నాట‌కాలాడుతున్నార‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఓటుకు నోటు కేసును పక్కదోవపట్టించడానికి తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు సెక్షన్‌ 8 అంశాన్ని తెరపైకి తెచ్చార‌న్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేక సంఘాల వారు రాష్ట్రం వచ్చిన తర్వాత కెసీఆర్‌ వైఖరి నచ్చక వెళ్లిపోగా, తిరిగి వారందరినీ సెక్షన్‌ 8 పేరుతో అక్కున చేర్చుకునేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారన్నారు.  విజయ వాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్‌ 8పై ముందుగా తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి, ఆ తర్వాత పరిస్థితి సరికాకుంటే గవర్నరు పరిశీలించాల్సి ఉందన్నారు. కానీ ఇప్పుడు ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ఆ విషయాన్ని పక్కదారి పట్టించి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో సెక్షన్ 8ను కావాలని తెరపైకి తెచ్చారన్నారు.  ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ గురించి కేంద్రాన్ని అడగని చంద్రబాబు, సెక్షన్‌ 8 గురించి మాత్రం అడుగుతున్నారన్నారు. వర్షాకాలం వచ్చినా రైతులకు విత్తనాలు అందించలేకపోతున్నారని విమర్శించారు.