కేసీఆర్‌కు రాజ‌కీయ జీవితం లేకుండా చేస్తా:  రేవంత్‌

ఓటుకు నోటు కేసులో ఏసీబీకి చిక్కిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బుధ‌వారం చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి విడుద‌లైన క్ష‌ణం నుంచే సీఎం కేసీఆర్‌పై మ‌రోసారి మండిప‌డ్డారు.  మే  31న సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్య స్టీఫెన్స‌న్‌కు రూ.50 ల‌క్ష‌లు లంచం ఇస్తూ ప‌ట్టుబ‌డ్డ అనంత‌రం మీడియా ముందు కేసీఆర్ నిన్ను బ‌ట్ట‌లిప్పి కొట్టిస్తా..అంటూ హెచ్చ‌రిక‌లు చేసిన రేవంత్ మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌ల‌తోనే విరుచుకుప‌డ్డారు. కేసీఆర్‌కు రాజ‌కీయ‌జీవితం లేకుండా చేస్తాన‌ని బ‌హిరంగ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కుటుంబ పాల‌న‌ను ఎత్తి చూపినందుకు కేసులో ఇరికించార‌ని ఆరోపించారు. మ‌రోసారి తొడ‌గొట్టి మీసాలు మెలేశారు. అభిమానులు ఇచ్చిన గండ్ర‌గొడ్డ‌లిని గాలిలోకి తిప్పారు. మందు తాగితే త‌ప్ప‌మాట్లాడ‌లేడ‌ని కేసీఆర్ ను తీవ్రంగా విమ‌ర్శించారు. మందులో సోడాపోసే వాళ్లు మంత్రుల‌య్యార‌ని ఎగ‌తాళి చేశారు. మంత్రి హ‌రీశ్‌రావుకు మెద‌డు మోకాళ్ల‌లో ఉంద‌ని, కేటీఆర్‌ నిజామాబాద్ జిల్లాలో అక్ర‌మ ఇసుక దందా చేస్తున్నార‌ని ధ్వ‌జమెత్తారు. కోర్టు ఉత్త‌ర్వులు అందిన వెంట‌నే చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి విడుద‌లైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే గోపీనాథ్‌, ఎంపీ చామ‌కూర మ‌ల్లారెడ్డి పార్టీ శ్రేణుల‌తో క‌లిసి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి పార్టీ కార్యాల‌యం వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు.