హిజ్రాల లింగ‌మార్పిడి చికిత్స‌ల‌కు కేంద్ర సాయం 

హిజ్రాలు త‌మ‌కు న‌చ్చిన విధంగా లింగ‌మార్పిడి చేసుకునేందుకు చ‌ట్ట‌ప‌ర‌మైన హ‌క్కు క‌ల్పించ‌డంతో పాటు, అందుకు అవ‌స‌ర‌మ‌య్యే శ‌స్త్ర చికిత్స‌ల‌కు కేంద్రం ఆర్థిక సాయం అందించ‌నుంది. దీనికి సంబంధించిన బిల్లును వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. హిజ్రాల సంక్షేమానికి సంబంధించి డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ ఏప్రిల్ 24న ప్ర‌వేశ పెట్టిన బిల్లులో కేంద్రం కీల‌క మార్పులు చేసి  ఖ‌రారు చేసే యోచ‌న‌లో ఉంది. ఈ చ‌ట్ట ప్ర‌కారం హిజ్రాలు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా లింగ‌మార్పిడి చేసుకోవ‌చ్చు. ఆర్థిక‌శాఖ అనుమ‌తినిచ్చిన త‌ర్వాత కేంద్రం దీనిపై నిర్ణ‌యం తీసుకోనుంద‌ని సామాజిక న్యాయ వ్య‌వ‌హారాలు, సాధికారిక‌ మంత్రి థావ‌ర్ చంద్ గెహ్లాట్ తెలిపారు. ఈ బిల్లు క‌నుక లోక్‌స‌భ ఆమోదం పొందితే, తృతీయ వ‌ర్గానికి చెందిన వారికోసం ప్రత్యేక జాతీయ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు వారిపై వివ‌క్ష చూపిన వారికి భారీ జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంది. హిజ్రాల త‌ల్లిదండ్రుల‌కు కూడా ప్ర‌త్యేక రాయితీల‌ను క‌ల్పిస్తారు.