విజ‌య‌వాడ‌ టు రాజమండ్రి.. పుష్కర హెలికాప్టర్లు

కృష్ణా తీరాన హెలికాప్ట‌ర్ ఎక్కితే గోదావ‌రి తీరాన దిగి హాయిగా పుష్క‌ర స్నానం చేయ‌వ‌చ్చు. ఇందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఎవ‌రూ ఊహించని విధంగా ప్రస్తుత పుష్కరాలకే ప్రత్యేక ఆకర్షణగా రాజమండ్రికి హెలికాప్టర్లు నడిపేందుకు పవన్‌ హాన్స్‌ అనే సంస్థ ముందుకు వచ్చింది. విజ‌య‌వాడ‌ నుంచి రాజమండ్రి పుష్కర ఘాట్లకు నేరుగా హెలికాప్లర్టు నడిపేందుకుగాను ఈ సంస్థ ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయ అధికారులతో సంప్ర‌దింపులు జ‌రిపారు. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ (ఈఓఐ) విధానంలో పుష్కరాలకు ప్రత్యేక హెలికాప్టర్లను నడపాలని తాము భావిస్తున్నామ‌ని తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా నేరుగా ఘాట్ల సమీపంలో హెలిపాడ్‌లను ఏర్పాటు చేసి హెలికాప్టర్లను నడపాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌య అధికారుల‌కు చెప్పారు. యాత్రికులకు భద్రత, మెరుగై సౌకర్యం కల్పించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే తమకు సమ్మతమేనంటూ పవన్‌ హాన్స్‌ ప్రతిపాదనను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజకిశోర్‌ స్వాగతించారు. హెలికాప్టర్లను నడిపే విషయానికి సంబంధించి టెక్నికల్‌ డిటైల్స్‌పై కూడా చర్చ జరిగింది. పార్కింగ్‌ బేలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, వాచ్‌ అవర్‌, మ్యాన్‌పవర్‌ వంటి అంశాలను పరిశీలించారు. అన్నింటికీ విమానాశ్రయం సన్నద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్లు నడిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన పవన్‌ హాన్స్‌.. రోజుకు ఎన్ని నడుపుతారు? ఏ సమయంలో ఉంటాయి? చార్జీ ఎంత? తదితర వాటిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ చర్చలు ఫలవంతమైతే… లక్షలాది మంది భక్తులు గోదావరి తీరానికి ట్రాఫిక్‌ చక్రబంధం నుంచి తప్పించుకుని నేరుగా హెలికాప్టర్‌లో రాజమండ్రి చేరుకోవ‌చ్చు.