ముఖ్యమంత్రులతో బాహుబలి కనెక్షన్

ప్రేక్షకుల్నే కాదు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా బాహుబలి మేనియాతో కనెక్ట్ చేశారు నిర్మాతలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేయగలిగారు. మేటరేంటంటే.. ఏపీలో ఈ సినిమా బెనిఫిట్ షోతో వచ్చిన మొత్తాన్ని నూతన రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది బాహుబలి టీం. చెప్పినట్టుగానే వసూలైన మొత్తం సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జపాన్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు, అట్నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఆ టూర్ కూడా కంప్లీట్ చేసుకొని రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు లేదా రేపు సీఎంను కలిసి చెక్ ను అందజేసే అవకాశముంది. పనిలోపనిగా ముఖ్యమంత్రి అనుమతిస్తే అతని కోసం ప్రత్యేక షో కూడా ఏర్పాటుచేసే అవకాశముంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా బాహుబలి సినిమాను చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు.. సీఎం కేసీఆర్ కోసం స్పెషల్ షో ఏర్పాటుచేస్తున్నట్టు సమాచారం. సీఎం కుటుంబసభ్యులతో పాటు.. మంత్రులు, అధికారులు.. ఇలా ఎంతమంది వస్తే అంతమంది కోసం ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు.