ఓటుకు నోటులో కొత్త ముఖం

ఓటుకునోటు కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వేం న‌రేంద‌ర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్త‌న్‌కు ఏసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ సెక్ష‌న్ 160 కింద మంగ‌ళ‌వారం ఈ నోటీసులు జారీచేశారు. బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌క‌ల్లా త‌మ ముందు హాజ‌రుకావాల‌ని నోటీసులో పేర్కొన్నారు. మే 31న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్ స‌న్‌కు రూ.50 ల‌క్ష‌లు ఇచ్చేముందు కృష్ణ‌కీర్త‌న్‌తో మాట్లాడినట్లు ఫోన్ కాల్ వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాయ‌ని ఏసీబీ పోలీసులు చెబుతున్నారు. అయితే, కృష్ణ కీర్త‌న్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాడా? మ‌త్త‌య్య‌, జిమ్మిబాబుల బాట‌లో వెళ్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎమ్మెల్యే సండ్ర‌, సెబాస్టియ‌న్ ఫోన్ కాల్స్ ఆధారంగా జ‌నార్ద‌న్‌కు నోటీసులు ఇవ్వ‌డానికి ఏసీబీ స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఈ కేసులో స్టీఫెన్‌స‌న్ ఇంట్లో రేవంత్ రెడ్డి దొరికిపోవ‌డంతో క‌థ అక్క‌డితో ఆగిపోయింది. లేకుంటే.. అంత‌కుముందు టీడీపీకి ఓటు వేయ‌డానికి స‌మ్మ‌తించిన‌వారు వెన‌క్కి త‌గ్గారు. దీంతో ఇప్పుడు వారంద‌రికి నోటీసులు ఇవ్వ‌డానికి ఏసీబీ సిద్ధమ‌వుతోంది. దీంతో ఈ కేసులో నిందితులు, సాక్షుల జాబితా మ‌రింత పెరుగ‌నుంది.